sbi-writes-off-rs-7016-crore-loansపెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు తన పరిధికి మించి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారనే నిజాన్ని ఒప్పుకోక తప్పదు. నాలుగు రోజుల పాటు సమస్యలు ఉంటాయి ఎదుర్కోండి అని ప్రభుత్వం చెప్పిన తరువాత కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతించింది సామాన్య ప్రజానీకం మాత్రమే. ఇదంతా ఎవరి కోసo అంటే… ‘మన కోసం, మన భావితరాల అభివృద్ధి కోసం’ అని గంటల తరబడి బ్యాoకుల దగ్గర క్యూ లైన్లో నిలబడి వారి సామాజిక జీవితాన్ని పనంగా పెడుతున్నారు. ఇప్పటివరకు బ్యాoకులలో జమ చేసిన మొత్తం నగదులో సింహభాగం సామాన్యుడిదే అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఈ జమ అయిన మొత్తంలో కూడా ఒక్క ఎస్బీఐలోకే ఎక్కువ మొత్తం చేరిందని స్వయంగా బ్యాంక్ అధికారులే అధికారికంగా వెల్లడించారు. అయితే జమ అయిన ఈ నగదు మొత్తాన్ని సదరు బ్యాoకు వారు వారి మొండి బాకీల రద్దుకు వినియోగించుకుంది అన్న చందంగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. 63 మంది నుండి రావాల్సిన 7000 కోట్ల మొండి బకాయిలను రద్దు చేస్తునట్లు వెలువడిన ప్రకటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. అందులోనూ లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు సంబంధించిన 1201 కోట్ల రుణం ఉండడం విశేషం. ఈ జాబితాలో పలువురు తెలుగు తేజాలు ఉన్నారు.

ఈ బడా వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసుకుని లాభాలను వారి ఖాతాలలో, నష్టాలను సామాన్యుల ఖాతాలలో జమ చేసినట్లుగా… స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం ఉందని వెలువడుతున్న ప్రధాన ఆరోపణ. అవే బ్యాoకులు పేద, చిన్న, సన్న కారు రైతుల విషయంలో కానీ, మధ్య తరగతి ప్రజల విషయంలో కానీ ఇంత ఉదాశీనత ఎందుకు చూపించరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంత ఎక్కువ మొత్తంలో అప్పు ఎగవేస్తే అంత పెద్ద వ్యాపారవేత్త అని బ్యాoకుల అధికారులు, ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా ఉంది.

బ్యాoకులలో నగదు మార్పిడికి, జమకు ఆoక్షలు పెట్టడం మాత్రమే ప్రభుత్వ భాద్యత కాదు, ఆ బ్యాoకులు తీసుకొనే నిర్ణయాలపై కూడా ప్రభుత్వానికి పట్టు ఉండాలి. గత తొమ్మిది రోజులుగా ప్రజలు ఇన్ని కష్టాలను ఓపిక పడుతున్నది బడా బాబుల రుణాల రద్దు కోసమేనా? ఈ తరం కాకపోయినా, తదుపరి తరంలో అయిన ఈ దేశం బాగుపడుతుంది అని అలోచించి ఇటువంటి నిర్ణయాలకు మద్దతు పలుకుతోంది దీనికోసమేనా? జవాబు చెప్పాల్సిన బాధ్యత బ్యాoకులదే కాదు ప్రభుత్వాలది కూడా!
తరతరాల నుండి సామాన్యుడు ఒక్కడే త్యాగాలు చేయాలా? దేశ రక్షణ కోసం సైనికుడు, దేశ అభివృద్ధి కోసం సామాన్యుడే ఎందుకు బలి కావాలి? సైనికుల ప్రాణ త్యాగాల వలనే మనం పొరుగు దేశాల దాడుల నుండి బయట పడగలుగుతున్నాం కానీ, మనకు తెలియకుండానే మన దేశoలో ఉన్న బడాబాబుల చేతుల్లో సమిధులవుతున్నాం. పొరుగు దేశాల దాడుల కన్నా, మనదేశంలో ఉన్న అక్రమార్కుల వలనే ఎక్కువ నష్టాన్ని చవిచూస్తుంది.

“ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా” అని రామదాసు ఆ శ్రీరాముడ్ని ప్రశ్నించినట్లు… ఎవరి సొమ్ముతో ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యుడికి న్యాయం చేయడానికే ఈ ప్రయత్నాలు అని ప్రభుత్వ పెద్దలు…. ఈ పోరాటాలు పేదవారి కోసమే అంటూ ప్రగల్బాలు పలికే ప్రతిపక్ష నేతలు… ప్రజాసేవే అని బోర్డులు తగిలించే బ్యాంకులు… ఇలా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఒక్క సామాన్యుడు కోసమే కాదు, దేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్ట పడాలంటే ఇలా బడాబాబులకు కొమ్ముకాసే చట్టాలను సవరించాల్సిందే. లేదంటే… ప్రజానీకం చూపించే రుచిని తట్టుకోవడం కష్టమవుతుంది.