Save Amaravati agitation 150 daysఅమరావతిని రాజధానిగా కొనసాగించే ఒత్తిడిలో భాగంగా రైతులు చేప్పట్టిన ఉద్యమం 150వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు పేరిట ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రభుత్వం అమరావతిని నాశనం చెయ్యాలని చూస్తుందని ఆరోపిస్తూ రాజధానికి స్వచ్చంధంగా భూములిచ్చిన రైతులు 150 రోజులుగా రోడెక్కారు.

“లాఠీలు ఝళిపించినా, అక్రమంగా కేసులు బనాయించినా, అరెస్టులు చేసి జైళ్లకు పంపినా ఉద్యమం నేటి వరకు శాంతియుతంగానే సాగింది. మునుముందు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం,” అంటూ రైతు సంఘాల వారు ప్రకటించారు. ఇప్పటికైనా మూడు రాజధానుల మాట విరమించుకొని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయండని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు

రాజధాని తరలింపు ప్రక్రియ మండలిలో టీడీపీ వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకోవడం, కోర్టుల జోక్యం, కరోనా వంటి కారణాలతో ప్రస్తుతానికి ఆగిపోయింది. అయితే అడపాదడపా జగన్ ప్రభుత్వం విశాఖకు మారాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మే 28న ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు తరలిపోతుందని పుకార్లు ఉన్నాయి.

కరోనా కారణంగా విధించిన ఆంక్షల వల్ల అమరావతి ఉద్యమానికి కాస్త ఆటకం కలిగింది. గుంపులుగా ఉండే పరిస్థితి లేకపోవడంతో పరిమిత స్థాయిలోనే నిరసనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం తమ ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా మళ్ళీ ఉద్యమిస్తాం అని రాజధాని రైతులు అంటున్నారు.