Satyadev Gurthunda Seethakalam Movieఇండస్ట్రీలో హీరోల కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరికి అట్టే టాలెంట్ ఉండదు. ఏదో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనో ప్రొడ్యూసర్లు పదే పదే సినిమాలు తీసి ప్రేక్షకుల మీదకు రుద్దడం వల్లనో సెటిలైపోతారు. కుటుంబ సభ్యులిచ్చిన అభిమానుల అండ లేకపోతే వీళ్ళు జీరోనే. రెండో క్యాటగిరీ కేవలం ప్రతిభను నమ్ముకుని పరిశ్రమకు వచ్చినవాళ్లు. సక్సెస్ కొడితే తప్ప మనుగడ ఉండదని తెలిసి పట్టువదలని విక్రమార్కుళ్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ కొంత అదృష్టం కలిసి రావాలి. అది తోడై హిట్టు పడితే మళ్ళీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. మాస్ మహారాజా దీనికి మంచి ఎగ్జాంపుల్. చిన్న వేషాల నుంచి స్టార్ గా ఎదిగిన వైనం తనది.

సత్యదేవ్ ఇదే కోవలోకి వస్తాడు కానీ పాపం లక్కు మాత్రం దోబూచులాడుతోంది. తనవరకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాడు. గాడ్ ఫాదర్ కంటే ఉదాహరణ అక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ కి అతిశయోక్తిగా అనిపించినా సరే ఇంత చిన్న వయసులో మెగాస్టార్ చిరంజీవి ముందు నిలబడి కొన్ని సీన్స్ లో డామినేట్ చేయడం అంత సులభం కాదు. కానీ సత్యదేవ్ చేసి చూపించాడు. బ్లఫ్ మాస్టర్ ఆ మాత్రం ఆడి పేరు తెచ్చుకుందంటే అది తన పెర్ఫార్మన్స్ వల్ల మాత్రమే. కాకపోతే అవకాశాలు వస్తున్నాయి కానీ దానికి తగిన గుర్తింపు, బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడానికి కావాల్సిన బ్లాక్ బస్టర్లు పడటం లేదు అందుకే ఇతని ప్రతిభ వృథాగా పోసిన పన్నీరులా మారుతోంది

తాజాగా గుర్తుందా శీతాకాలంతో వచ్చాడు. కన్నడలో సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న లవ్ మాక్ టైల్ కు రీమేక్ ఇది. కేవలం ఫలితం చూసి రీమేక్ చేయాలనుకుని తొందపడ్డారో లేక గతంలో నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్ లాంటివి వచ్చాయని చూసుకోకుండా తొందరపడ్డారో తెలియదు కానీ మొత్తానికీ సినిమా ఏ వర్గాన్ని మెప్పించలేక నెగటివ్ రిపోర్ట్స్ తెచ్చేసుకుంది. ఎమోషన్లంటే విపరీతమైన సాగతీతనే ఫీలింగ్ నుంచి మన దర్శకులు ఎప్పుడు బయట పడతారో అర్థం కాదు. ప్రేమను వ్యక్తపరచడం సాదాసీదా సన్నివేశాలతో కుదరదని, బాగా తెలివి మీరిపోయిన ఇప్పటి యూత్ ని తక్కువ అంచనా వేయడం తగదని మరోసారి ఈ సినిమా నిరూపిస్తుంది

సత్యదేవ్ తనవరకు ఎలాంటి కామెంట్స్ రాకుండా చక్కగా నటించాడు. కానీ అతన్ని వాడుకునే స్థాయిలో కంటెంట్ లేనప్పుడు నిస్సహాయంగా మిగలడం తప్ప ఏం చేయగలడు. ఆ మధ్య పవర్ ఫుల్ యాక్టింగ్ తో గాడ్సేలో అదరగొట్టినా అతిశయోక్తితో కూడిన పాత చింతకాయ పచ్చడి కథా కథనాలతో దర్శకుడు చేసిన తప్పులకు సత్యదేవ్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముక్కు మొహం తెలియని రిషబ్ శెట్టిని కాంతారలో ఆదరించిన మన ప్రేక్షకులు ఇంత గుర్తింపున్న తెలుగు నటుడిని తిరస్కరిస్తారా. అతనికి ఇప్పుడు కావాల్సింది సరైన కథలు, టాలెంట్ హౌస్ ని సరిగ్గా వాడుకునే క్రియేటివ్ దర్శకులు. లేదంటే అంగట్లో అన్నీ ఉన్న సామెతలాగా పదే పదే ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి.