satya nadella chandrababu naiduహైదరాబాద్ ను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో విజయవంతమైన చంద్రబాబు, ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్ లో అదే స్థాయి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రయత్నాలు గావిస్తున్నారు. ఇదే ఆకాంక్షను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ వద్ద ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ రోజు ఉదయం తన గృహంలో సత్యతో భేటీ అయిన చంద్రబాబు దాదాపు ఒక గంటా 20 నిముషాల పాటు చర్చించారు.

ఈ సందర్భంగా ఏపీలో “మైక్రోసాఫ్ట్” సంస్థను ఏర్పాటు చేయాలని సత్య నాదెళ్ళను కోరినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో అన్నీ సక్రమంగా జరిగితే అనంతపురంలో ‘మైక్రోసాఫ్ట్’ సంస్థ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబుతో పలువురు మంత్రులు కూడా భాగస్వామ్యులు అయిన ఈ భేటీలో పౌరసేవలు, విద్య, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి కోసం మరియు మెరుగైన సమాచార సేకరణ, ముందస్తు విశ్లేషణ తదితర అంశాలపై సాంకేతిక సహకారం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ సమావేశం పూర్తయిన తర్వాత ఏపీ సిఎం విజయవాడకు బయలుదేరి రాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ టీ హబ్ ను సందర్శించారు. తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టీ హబ్ లోని స్టార్టప్ ప్రతినిధులతో ముచ్చటించిన సత్య, ‘స్టార్టప్ అభివృద్ధిలో భాగస్వామ్యం’ అవుతామని అన్నారు.