Sattenappli-TDP-Kodela-Sivaramగత ఎన్నికలలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఓటమి, మరణం తర్వాత అక్కడి నుంచి గెలిచి మంత్రి అయిన అంబటి రాంబాబు చెలరేగిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆ స్థానాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కేటాయించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ మూడున్నరేళ్ళలో వైసీపీ ప్రభుత్వం వైఖరితో విసిగివేసారిపోయిన రాజధాని రైతులు వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా సత్తెనపల్లికి షిఫ్ట్ అయిపోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటికి మద్య యుద్ధం మొదలైనట్లే.

వైసీపీలో పరిస్థితులు ఇలా ఉండగా సత్తెనపల్లిలో టిడిపి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. వచ్చే ఎన్నికలలో అక్కడి నుంచి పోటీ చేయాలని కోడెల కుమారుడు శివరాం భావిస్తున్నారు. కానీ గత ఎన్నికలలో ఆయన అవినీతి కారణంగానే తండ్రి ఓడిపోయారనే కనుక ఈసారి తనకు టికెట్ కేటాయించాలని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మద్య కోల్డ్ వార్ నడుస్తోంది.

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగబాబు కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురూ టికెట్ ఆశిస్తుండటంతో ఎవరి కార్యక్రమాలు వారు చేసుకొంటున్నారు. ఈ కారణంగా నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు ముగ్గురి మద్య చీలిపోయారు. కనుక సత్తెనపల్లి టిడిపికి ముగ్గురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ అదే పార్టీని బలహీన పరుస్తోంది. కానీ టిడిపి అధిష్టానం సత్తెనపల్లిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో మంత్రి అంబటి రాంబాబు లేదా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అక్కడ బలపడేందుకు దోహదపడుతున్నట్లు అవుతోందని టిడిపి కార్యకర్తలు భావిస్తున్నారు.