Sathyaraj apologies regarding Baahubali 2 release issue in Karnatakaకన్నడనాట ‘బాహుబలి 2’ విడుదల ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో… చిత్ర దర్శకుడు రాజమౌళి కన్నడలో మాట్లాడుతూ ఓ వివరణ ఇచ్చుకున్నాడు. ‘బాహుబలి-2 ది కన్ క్లూజన్’ సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని, సత్యరాజ్ ఈ సినిమా దర్శకుడు, నిర్మాత కానీ కాదని, కేవలం ఒక నటుడు మాత్రమేనని సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. అయితే దీనిని కూడా అంగీకరించమని, సత్యరాజ్ క్షమాపణలు చెప్పే వరకు ‘బాహుబలి 2’ సినిమా విడుదలకు కన్నడనాట సహకరించమని కన్నడ ధళవళ పార్టీ నాయకుడు వాటాళ్ నాగరాజు తేల్చిచెప్పారు.

తమ పోరాటం ‘బాహుబలి’ సినిమాపై కాదని, తమ పోరాటం సత్యరాజ్ మీద అని, కన్నడిగులను అపహాస్యం చేసిన సత్యరాజ్ నటించిన సినిమాలు కన్నడంలో విడుదల జరగదని తెలిపారు. రాజమౌళి కన్నడలో మాట్లాడినంత మాత్రాన సరిపోదని, సత్యరాజ్ తో క్షమాపణలు చెప్పించాలని సూచించారు. ఈ విషయంలో సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వచ్చినా తమ నిర్ణయం మారదని స్పష్టం చేశారు. తమ నిర్ణయానికి కన్నడ సినీ పరిశ్రమ మద్దతు కూడా ఉందని, ఈ నెల 21న సత్యరాజ్ శవయాత్ర నిర్వహిస్తామని తెలిపినట్టుగా, అలాగే ఈ నెల 28న బంద్ జరుగుతుందని, ‘బాహుబలి 2’ విడుదల అడ్డుకుంటామని అన్నారు.

ఇక, తాజా పరిణామాలతో తాను రంగంలోకి దిగితే తప్ప పని కాదని భావించిన సత్యరాజ్, ఎట్టకేలకు పెదవి విప్పారు. “తాను కన్నడ ప్రజలకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని కుండబద్దలు కొట్టే ప్రకటన చేసారు. అలాగే తన వల్ల ‘బాహుబలి’ వంటి గొప్ప చిత్రానికి ఇబ్బందులు రావడం ఇష్టం లేదని, ఈ సినిమా ప్రతి ఒక్కరి దరికీ చేరాల్సి వుందని అన్నారు. కన్నడ ప్రజలంతే తనకెంతో గౌరవం ఉందని, గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లుగా” సత్యరాజ్ పేర్కొన్నారు. దీంతో ఇక్కడితోనైనా ఈ వివాదానికి ఓ ‘ఎండింగ్’ పడుతుందేమో చూడాలి.