Sathamanam Bhavati National Film Awardజాతీయ అవార్డుల జాబితాలో ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషకు ప్రాధాన్యత దక్కడం హర్షించదగ్గ విషయం. ఎప్పుడూ బాలీవుడ్ మరియు కన్నడ చిత్రాల ఆధిపత్యమే ఉండే జాతీయ అవార్డుల వేడుకలలో, ఈ సారి ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా “పెళ్లిచూపులు” సినిమా నిలువగా, ‘ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రం’గా “శతమానం భవతి” నిలవడం విశేషం. అలాగే ఈ జాతీయ అవార్డులలో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం (జనతా గ్యారేజ్) మరియు ఉత్తమ డైలాగ్స్ రచయితగా తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు) దక్కించుకున్నారు.

అయితే ప్రకటించిన అవార్డులన్నీ 2016 సంవత్సరానికి సంబంధించినవి కాగా, ఇందులో ‘శతమానం భవతి’ సినిమా మాత్రం 2017లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకుంది. అలాగే ఇటీవల బుల్లితెరపై కూడా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంది. మరి ఈ ఏడాదిలో విడుదలైన సినిమాకు గతేదాడిలో అవార్డు ఇవ్వడం ఏంటి? అన్న సందేహం సామాన్య సినీ ప్రేక్షకులలో వ్యక్తమవుతోంది.

గతంలో అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమా సందర్భంలో కూడా ఇలాగే జరిగింది. అయితే జాతీయ అవార్డులను పరిశీలనలోకి తీసుకునేటపుడు, ఆయా చిత్రాలు సెన్సార్ అయిన తేదీలనే పరిగణనలోనికి తీసుకుంటారు తప్ప, విడుదల తేదీలతో సంబంధం ఉండదని తెలుస్తోంది. ఈ కారణం చేతనే, గతంలో ‘అరుంధతి’ సినిమాకైనా, ప్రస్తుతం ‘శతమానం భవతి’ సినిమాకైనా అవార్డులు దక్కాయని సమాచారం. ఈ చిన్న సందేహం సగటు సినీ ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తోన్న నేపధ్యంలో… సినీ వర్గీయులు స్పష్టత ఇచ్చారు.