Sasilaka - Panner Selvam AIADMK Tamil Nadu Politicsఅన్నాడీఎంకే చీఫ్‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారానికి స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే సోమ‌వార‌మే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవ‌కాశాలున్నాయని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. శనివారం రాష్ట్ర రాజ‌కీయాల్లో అక‌స్మాత్తుగా సంభ‌వించిన పెను మార్పులు ఇందుకు మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి.

జ‌య‌ల‌లిత న‌మ్మిన‌ బంటు అయిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు షీలా త‌న ప‌ద‌వికి హ‌ఠాత్తుగా రాజీనామా చేశారు. అలాగే ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో జ‌య నియ‌మించిన ఇద్ద‌రు ఐఏఎస్‌లు సెల‌వుపై వెళ్లారు. సాధార‌ణంగా శ‌శిక‌ళ వెంట ఉండి, ఆమె వెళ్లేముందు కారు వర‌కు వ‌చ్చి సాగ‌నంపే ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం గత కొన్ని రోజులుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. శుక్ర‌వారం మెరీనా బీచ్ వ‌ద్ద అన్నాదురైకు అంజ‌లి ఘ‌టించి వెళ్తున్న చిన్న‌మ్మ‌కు సీఎం ముఖం చాటేశారు.

త‌మిళ‌నాడులో మారిన ఆకస్మిక రాజ‌కీయానికి ఇవి ఉదాహ‌ర‌ణ‌లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వీట‌న్నింటిని ప‌క్క‌న‌పెడితే ఆదివారం మ‌ధ్యాహ్నం పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించ‌నున్న స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని శ‌శిక‌ళ ఆక‌స్మిక ఆదేశాలు జారీ చేయ‌డం ఏదో జ‌రుగుతోంద‌న్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తోంది. పార్టీపై పూర్తి ప‌ట్టు సాధించిన చిన్న‌మ్మ ఈ నెల‌లోనే ఓ మంచి రోజున ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్ఠించాల‌ని యోచిస్తున్నట్లుగా ఓ టాక్.

ఇందులో భాగంగానే 136 మంది ఎమ్మెల్యేల‌కు చెన్నై రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అక‌స్మాత్తు పిలుపుతో ఆశ్చ‌ర్యానికి గురైన ఎమ్మెల్యేలు ఆగ‌మేఘాల‌పై శ‌నివారం సాయంత్ర‌మే న‌గ‌రానికి చేరుకున్నారు. ఈ నెల 6, 8, 9, లేదంటే 24వ తేదీల్లో ఏదో ఒక రోజు శ‌శిక‌ళ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. శ‌శిక‌ళ ఆశ‌లు ఎలా ఉన్నా ముఖ్య‌మంత్రి పద‌వి నుంచి తప్పుకునేందుకు ప‌న్నీర్ సెల్వం సిద్ధంగా లేకపోవడం ఇక్కడ ట్విస్ట్.

ఓ పక్కన కేంద్రం నుంచి, మరో పక్కన జయలలితకు నమ్మినబంటుగా ప్ర‌జ‌ల నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉన్న తానెందుకు తప్పుకోవాలంటూ.., ఇటీవ‌ల పన్నీర్ సెల్వం శ‌శిక‌ళ మ‌ద్ద‌తుదారులను ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం త‌న ప‌ట్టాభిషేకానికి శ‌శిక‌ళ రంగం సిద్ధం చేసుకుంటుండ‌డంతో ప‌న్నీర్ వెన‌క్కి త‌గ్గుతారో లేక ఎదురెళ్ళి పోరాడుతారో అన్న ఆసక్తి తమిళనాట రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఏది ఏమైనా ఫిబ్రవరి నెల తమిళనాడు రాజకీయాలకు కీలకం కాబోతోందన్నది అయితే స్పష్టం.