Sasikala To Shift To Tamil Nadu Prisonఅక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక్కడ చిన్నమ్మకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేమని, ఒక సాధారణ ఖైదీ మాదిరి ట్రీట్ చేయాలని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో, ప్రస్తుతం శశికళ జీవనం కాస్త ఇబ్బందికరంగానే ఉందన్న సంగతులు కూడా బహిర్గతమే. అయితే దీనిని తట్టుకోలేని పళనిస్వామి అండ్ కో, సాధ్యమైనంత త్వరగా తమిళనాడులోని జైలుకు తరలించేందుకు కర్ణాటక కోర్టును ఆశ్రయించనుందని సమాచారం.

శశికళ శిక్షాకాలం తమిళనాడు జైలులో అనుభవించేందుకు వీలుగా ఆమెకు అవకాశం కల్పించాలని పళని స్వామి సర్కార్ కోరనుందట. ఒకవేళ తమిళనాడు సర్కార్ చేసే ఈ విజ్ఞప్తిని కనుక కర్ణాటక ప్రభుత్వం అంగీకరిస్తే, ఆ విజ్ఞప్తిని కోర్టు ముందు ఉంచుతారని తెలుస్తోంది. ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు గానీ, శనివారం నాడు అసెంబ్లీలో పళనిస్వామి బలనిరూపణ అనంతరం, బెంగళూరు వెళ్లి శశికళ ను కలుస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శశికళను తమిళనాడు జైలుకు మార్చాలనే అంశం ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని జైలులో ఉంటున్న శశికళ ప‌క్క సెల్లోనే ఆరు హ‌త్య‌లు చేసిన సైనేడ్ మ‌ల్లిక ఉంద‌ట‌. ఆమె గ‌తంలో దేవాల‌యాల్లో ప‌లువురు మ‌హిళ‌ల‌ను ప‌రిచ‌యం చేసుకొని.. వారి నుంచి బంగారం దోచుకోవడంతో పాటు, ఆరుగురు మ‌హిళ‌ల‌ను కూడా విషం పెట్టి చంపేసింది. ప్ర‌స్తుతం మ‌ల్లిక త‌న ప‌క్క సెల్లోనే ఉన్న శ‌శిక‌ళ‌తో మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని ప్రముఖ బెంగ‌ళూరు మిర్ర‌ర్ ప‌త్రికలో పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆమెతో మాట్లాడ‌ని శ‌శిక‌ళ, ఓ సారి మాత్రం ఆమెని చూసి చిరున‌వ్వు చిందించట.