Sasikala supposrting mlasతమ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ నుంచి తప్పించుకుని… పన్నీర్ సెల్వంకు మద్దతు పలకకుండా శశికళ మనుషులు, మన్నార్ గుడి మాఫియా సకల సదుపాయాలు కల్పిస్తోంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, పొంగల్, దోశ, పూరీ లాంటి వివిధ రకాలైన టిఫిన్లతో పాటు, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపలు, బిర్యానీ, రకరకాల కూరలు, థాలీ, డెజర్టులు తదితరాలు మెనూలో ఏర్పాటు చేసారని తెలుస్తోంది. వీటికి తోడు మద్యం సేవించే వారి కోసం రకరకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచినట్లుగా పొలిటికల్ వర్గాల టాక్.

ఒక్క మాటలో చెప్పాలంటే… “తిన్నోడికి తిన్నంత… తాగినోడికి తాగినంత…” అన్న చందంగా ఏర్పాట్లు ఉన్నాయని ప్రధానంగా తెలుస్తోన్న విషయం. అలాగే చీమ చిటుక్కుమన్నా శశికళ మనుషులు ప్రత్యక్షం అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారట. దీనికి తోడు అరగంటకోసారి కాఫీలు, టీలు అంటూ అక్కడకు వెళ్లి… ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ వ్యవహారం పలువురు ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పిస్తోందని… కొన్ని సార్లు గొడవ కూడా చేశారని సమాచారం.

రెండో రోజుకు చేరుకున్న ఈ క్యాంపు రాజకీయాల్లో… ఎమ్మెల్యేలు మీడియా కంట పడకుండా ఉండడం, ఒక్కో ఎమ్మెల్యేకు తనకు చెందిన ఇద్దరు అనుచరులను బాడీగార్డులుగా నియమించడం, బాడీగార్డుల కళ్లుగప్పి ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితిని కల్పించినట్లుగా తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్ లో ఉంచిన శశివర్గ ఎమ్మెల్యేలపై ఇంత నిఘా ఉంచడంతో పాటు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఫోన్లను తీసేసుకున్నారు. ఒకవేళ ఎవరి వద్దైనా రహస్యంగా ఫోన్లు ఉన్నప్పటికీ… అవి పని చేయకుండా జామర్లను ఏర్పాటు చేశారు.

రిసార్ట్స్ వద్ద వందల సంఖ్యలో శశికళ అనుచరులు కాపలాగా ఉన్నారు. రోజూ ఉండే సెక్యూరిటీని అక్కడ నుంచి పంపించేసి… ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చదవడానికి వార్తాపత్రికలు గానీ, చూడ్డానికి టీవీలను గానీ అందుబాటులో లేకుండా చేశారు. బయట జరుగుతున్న పరిణామాలు ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేలకు తెలియకుండా శశి వర్గం జాగ్రత్త పడుతోంది. తమ ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచడాన్ని శశికళ వర్గం పూర్తిగా సమర్థించుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కొనడానికి పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నిస్తోందని… అందుకే వారిని క్యాంపుల్లో ఉంచామని చెప్పుకుంటోంది.

ఇదిలా ఉంటే, తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఏంకే ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్ ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై తక్షణం విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు నిరాకరించింది. చెన్నైకి చెందిన సెంతిల్ కుమార్ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా, న్యాయవాది జీఎస్ మణి వాదనలు వినిపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నిందితురాలుగా ఉన్నందున, శశికళ సీఎంగా ప్రమాణం చేయడం రాజ్యంగ విరుద్ధం అవుతుందని వాదించారు.

సదరు కేసులో తీర్పు వచ్చే వరకు శశికళ సీఎంగా ప్రమాణం చేయకుండా నిరోధించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ ముందు వాదనలు వినిపించారు. ఒకవేళ ఆమెను నిందితురాలిగా ప్రకటిస్తే, రాజీనామా చేయాల్సి వస్తుందని, దీంతో సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయని, అల్లర్లు జరిగే ప్రమాదం ఉంటుందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీనిపై జస్టిస్ ఖేహార్ ధర్మాసనంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్ లతో సంప్రదించిన మీదట తక్షణం విచారణ జరిపేందుకు నిరాకరించారు.