sasikala Natarajan MLA - AIADMKతమిళనాట రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్న తరుణంలో… అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ క్యాంపు రాజకీయాలకు తెర తీసినట్టు సమాచారం. శశికళకు మద్దతుగా ఉన్న 131 మంది ఎమ్మెల్యేలను ఓ హోటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. శశికళ వర్గీయులు దగ్గరుండి మరీ, సదరు ఎమ్మెల్యేలను బస్సుల్లో ఎక్కించి తరలించారనే వార్తలు తమిళనాట హల్చల్ చేస్తున్నాయి. మరో పక్కన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కోసం శశికళ వర్గీయులు యత్నిస్తున్నారు.

రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభిస్తే తమకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్లే యోచనలో శశికళ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు మద్దతు తెలిపిన వారి నుండి సంతకాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. పన్నీర్ సెల్వం నుండి గానీ, డీఎంకే, బీజేపీ వంటి పార్టీల నుండి గానీ ఎలాంటి ఒత్తిళ్లు నెలకొనకుండా సదరు ఎమ్మెల్యేల నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, వారి నుంచి ఎలాంటి సమాచారం ఇతరులకు చేరకుండా చర్యలు చేపట్టారు. దీంతో తమిళనాట కలకలం రేగుతోంది. అధికారం కోసం శశికళ వేస్తున్న ఎత్తులు, కదుపుతున్న పావులను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఇదిలా ఉంటే, పన్నీరు సెల్వంకు కొందరు తమిళ సినీనటులు మద్దతు పలికారు. ముఖ్యంగా ప్రముఖ నటుడు కమల హాసన్ స్పందిస్తూ, ‘తమిళనాడు ప్రజలారా, త్వరగా నిద్రపోండి, రేపు వాళ్లు మనకంటే ముందే నిద్ర లేస్తారు’ అన్నారు. దుష్ట రాజకీయాలను ప్రోత్సహించవద్దని, సమ్మతి లేదా అసమ్మతి ఏదైనా సరే, గట్టిగానే చెప్పాలని, మాట్లాడకుండా ఉంటే కుదరదని సూచించారు. తమిళనాడు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయవద్దని, తమిళనాడు కోసం యావత్తు భారతదేశం అహింసా పద్ధతిలో పోరాడుతుందని కమల్ అన్నారు.

అలాగే ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ కూడా తనదైన శైలిలో స్పందించారు. మౌనాన్ని వీడిన ఓపీఎస్, ఒక హీరోగా ముందుకొచ్చారని, ఇప్పుడే డ్రామా మొదలైందని పేర్కొంది. ఓపీఎస్ సార్, సరైన సమయంలో గొప్పగా, ధైర్యంగా మాట్లాడారని, ఆయనకు హాట్సాప్ అని యువనటుడు ఆర్య అన్నాడు. మరో నటుడు అరవిందస్వామి చెబుతూ.. ‘బఠానీలు తింటూ న్యూస్ చూస్తున్నాను, ఉప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది, ఇక, పాప్ కార్న్ తింటా’నని అన్నాడు. దక్షిణాది నటుడు సిద్ధార్థ స్పందిస్తూ.. మెరీనాలో ఓపీఎస్, తమిళనాడు రాజకీయాలు హాలీవుడ్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థోర్న్స్’, హాలీవుడ్ మూవీ ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ను తలపిస్తున్నాయన్నాడు.