ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ రాజీనామా చేశారా? అంటే అవుననే తమిళనాడు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ డిప్యూటీ చీఫ్ టీటీవీ దినకరన్ విచారణ నేపథ్యంలో చెన్నైలో వేగంగా మారుతున్న పరిణామాల క్రమంలో పళనిస్వామి వర్గం కేబినెట్ భేటీ నిర్వహించి, పన్నీరు సెల్వంతో చర్చలు జరిపారని, దీంతో ఆయన డిమాండ్ మేరకు పార్టీ పదవులకు రాజీనామా చేయాలని శశికళ, దినకరన్ లను కోరారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైలు నుంచే శశికళ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేశారని వార్తలు వినపడుతున్నాయి.

తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పన్నీరు సెల్వం – పళనిస్వామి (శశికళ) వర్గాలు కలిసిపోనున్నాయని సమాచారం. అంతే కాకుండా పార్టీలో శశికళ, మన్నార్ గుడి మాఫియాకు ప్రాతినిధ్యం లేకుండా చేయాలన్న ఒప్పందంతోనే వారిద్దరూ ఒక్కటవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం… ఓ కొత్త ఫార్ములాకు ఇద్దరు నేతలూ ఓకే చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగుతారని, అయితే అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పన్నీర్ సెల్వం ఉంటారని… రెండు వర్గాలకూ ఇది ఆమోదయోగ్యమేనని పన్నీర్ సెల్వం వర్గంలోని ఓ సీనియర్ ఎంపీ జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీతో తెలిపారు.

అయితే ఇదంతా దినకరన్ అరెస్ట్ నేపధ్యంలో మారిన రాజకీయ పరిస్థితులు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించి, ఆపై అరెస్ట్ చేస్తారని భావిస్తున్న శశికళ అక్క కొడుకు దినకరన్, జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళను కలిసేందుకు బెంగళూరుకు బయలుదేరిన ఆయన, అంతకుముందు పలువురు న్యాయవాదులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ నేడు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయవాదులు భావిస్తున్నట్టు సమాచారం. ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తును తమకు కేటాయిస్తే, ఎన్నికల కమిషన్ కు 60 కోట్ల వరకూ లంచం ఇచ్చేందుకు దినకరన్ సిద్ధపడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.