Sarrainodu success meetఏది విడుదల కాకుండానే సక్సెస్ మీట్ ఏంటి అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు… ‘సరైనోడు’ సినిమాపై చిత్ర యూనిట్ అంత నమ్మకంతో ఉంది మరి. అయితే ఈ సక్సెస్ మీట్ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేస్తోంది కాదు, ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ‘సరైనోడు’ ఆడియో సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేయదలచినది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘సరైనోడు’ సినిమా ఆడియో ఏప్రిల్ 1వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా విశాఖపట్టణంలో ఓ భారీ వేడుకను ఏర్పాటు చేసి ఆడియోను విడుదల చేయాలని భావించారు. కానీ, తర్వాత జరిగిన పరిణామాల రీత్యా ఆడియో వేడుకకు బదులుగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వైజాగ్ లోని ఆర్.కే.బీచ్ లో ఏప్రిల్ 10వ తేదీన “సరైనోడు” ఆడియో సక్సెస్ మీట్ ను భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావచ్చన్న వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి సమాచారం బయటకు పొక్కలేదు. ఇటీవల విడుదలైన టీజర్ తో భారీ అంచనాలు ఏర్పడిన “సరైనోడు” సినిమాపై మెగా అభిమానులు గంపెడు ఆశలే పెట్టుకున్నారు.