Sarkaru Vaari Paata planning to release in other languages“సరిలేరు నీకెవ్వరూ” సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు పైనే గడిచిపోయింది. దీంతో మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసేయాలన్న ఆకాంక్ష సూపర్ స్టార్ అభిమానుల్లో ఎక్కువవుతోంది. దీనికి తోడు ఇటీవల విడుదలైన ‘కళావతి’ పాటలో మహేష్ చూడముచ్చటగా ఉండడంతో, ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మరో పాట ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సారి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తోందని సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. ఈ వారంలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ‘సర్కార్ వారి పాట’ ఇతర భాషలలోకి కూడా అనువాదం అవుతోందని లేటెస్ట్ గా ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

సినిమా కంటెంట్ బాగా వచ్చిందని, దీంతో తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలోకి కూడా డబ్బింగ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారని, సమయాభావనను బట్టి ఎన్ని భాషలలో విడుదల అనేది నిర్ణయం జరుగుతుందని ట్విట్టర్ వేదికగా మహేష్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఇది నిజంగా సాధ్యమయ్యే విషయమేనా? కేవలం ఫ్యాన్స్ ఆతృతేనా? అంటే…

మహేష్ సమకాలీన హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఇప్పటికే పాన్ ఇండియా మూవీలు చేయడంతో, తమ హీరో కూడా పాన్ ఇండియా స్థాయిలో మూవీని రిలీజ్ చేయాలని మహేష్ బాబు అభిమానులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. కానీ అందుకు తగ్గట్లుగా మహేష్ సినిమాలు చేయకపోవడంతో ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.

“పుష్ప” సక్సెస్ తర్వాత రిలీజ్ కు సిద్ధమైన ‘రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్’లకు మంచి క్రేజ్ ఉండడంతో, ఈ కోవలోనే మహేష్ సినిమా కూడా రిలీజ్ అయితే సక్సెస్ సాధించవచ్చనేది ఫ్యాన్స్ భావన. అందుకే ట్విట్టర్ వేదికగా అనేక సందర్భాలలో మైత్రీ మూవీ మేకర్స్ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ ఒత్తిడి ఇప్పుడు కార్యరూపం దాలుస్తుందని భావిస్తున్నారు.

బహు భాషలలో రిలీజ్ పై చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ, సరైన కంటెంట్ లేకుండా పాన్ ఇండియా స్థాయిలో బరిలోకి దిగితే మాత్రం అది చేతులు కాల్చుకునే ప్రక్రియగానే ముగుస్తుంది తప్ప, సూపర్ స్టార్ కు గానీ, ఫ్యాన్స్ కు గానీ కావాల్సిన కిక్ ను పంచదని గుర్తుంచుకోవాలి.

‘స్పైడర్’ సినిమా తమిళ రిలీజ్ విషయంలో ఇదే విధంగా దెబ్బ తిన్న వైనం తెలియనిది కాదు. దీంతో ఈ సారైనా సరైన సబ్జెక్టుతో ఇతర భాషల ప్రేక్షకుల ముందుకు వెళితే, కనీసం మహేష్ ఇమేజ్ కు డామేజ్ జరగకుండా ఉంటుంది. సెట్స్ కు వెళ్లకముందే ‘రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్’లు పాన్ ఇండియా సబ్జెక్టులుగా నిర్ణయం జరిగి నిర్మాణాలు జరుపుకున్నాయని ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలి.