sarkaru vaari paata mass songసూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కార్ వారి పాట” సినిమా కోసం అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చిలలో ఒక్కో సాంగ్ విడుదలకు నోచుకోగా, మార్చి రానుంది, అలాగే ఉగాది పర్వదినం కూడా రాబోతున్న తరుణంలో మరో సాంగ్ ప్రకటన ఏమైనా ఉంటుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

ముందుగా వచ్చిన ‘కళావతి’ యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్స్ క్లిక్స్ దాటుకుని, ప్రస్తుతం 116 మిలియన్ క్లిక్స్ తో మెలోడీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక రెండో సాంగ్ గా వచ్చిన ‘పెన్నీ’ పాట బీట్ ఇష్టపడే వారిని అమితంగా ఆకట్టుకోగా, యూట్యూబ్ లో ఈ పాటకు ఇప్పటివరకు 23 మిలియన్ క్లిక్స్ ను మాత్రమే అందుకుంది.

దీంతో మూడో సాంగ్ తో సౌండ్ రీ సౌండ్ రావాలని మహేష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏ పాట విడుదల అవుతుందో ప్రస్తుతానికి సమాచారం లేదు గానీ, ఈ సినిమాలో ‘ఐటెం సాంగ్’ ఉంటుందా? లేదా? అన్న ఫ్యాన్స్ ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించింది. ఇటీవల అనంత శ్రీరామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టత ఇచ్చారు.

‘సర్కార్ వారి పాట’ సినిమాలో చివరిగా పాటగా వచ్చేది, ‘ఐటెం సాంగ్’ అని చెప్పలేం గానీ, హీరో – హీరోయిన్ల నడుమ ఓ మాంచి మాస్ పాట అయితే ఉండబోతోందని చెప్పడంతో, ఈ పాటలో మహేష్ లుంగీ డ్యాన్స్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ‘పోకిరి, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరూ’ సినిమాల మాదిరి మాస్ స్టెప్పులతో మహేష్ చూడొచ్చని పండగ చేసుకుంటున్నారు.

ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇంకా మూడు పాటలు విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. ఉగాదికి ఒకటి, శ్రీరామనవమికి మరొకటి విడుదల చేసినా, రిలీజ్ కు ముందు మరో పాటను విడుదల చేస్తే లెక్క సరిపోతుందని, అభిమానులు మంచి రోజులు లెక్కలు వేసుకుంటున్నారు.

అయితే ఇప్పటివరకు ఏది రిలీజ్ చేసినా అది ముందుగానే లీక్ అవ్వడం, అభిమానులు మైత్రీ మూవీ మేకర్స్ ను తిట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఈ సారైనా ఇందుకు విరుద్ధంగా ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా రిలీజ్ చేస్తారేమో అన్న ఒక చిరు ఆశతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. మే 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు.