Sarkaru Vaari Paata Broke the Sentiment“సర్కార్ వారి పాట” మొదటి స్వరం ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అప్ డేట్స్ ను ఈ రోజు ఉదయం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. నేటితో మొదలుకుని 9వ తేదీన, 11వ తేదీన మరో రెండు అప్ డేట్స్ ను ఇస్తూ 14వ తేదీన చివరగా మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసారు.

ఇక నేటి అప్ డేట్ విషయానికి వస్తే… ‘కళావతి’ పేరుతో ఈ పాట ఉండబోతుందని స్పష్టం చేసారు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘కళావతి’తో ప్రేమలో పడండి అంటూ చిత్ర యూనిట్ ఓ సింపుల్ పోస్టర్ ను విడుదల చేసారు. సినిమాలో హీరోయిన్ పేరు ‘కళావతి’ కాగా, ఆమె పేరుతోనే ఈ పాట ఉండబోతుందని స్పష్టమైంది.

అయితే ఈ సెంటిమెంట్ మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. ఎందుకంటే గతంలో హీరోయిన్ పేరుతో ఇలాగే ఓ సాంగ్ ఉండగా, బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫలితం తారుమారయ్యింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన “ఆగడు” సినిమాలో హీరోయిన్ తమన్నా క్యారెక్టర్ పేరయిన ‘సరోజా’ పేరుతో ఓ సాంగ్ ‘ఆజా సరోజా’ ఉన్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు కూడా సంగీత దర్శకుడు థమన్ కావడం మరో విశేషం. అయితే ఈ సారి సెంటిమెంట్స్ అన్నింటిని బ్రేక్ చేస్తామని అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్ మే 12 అనేదే సెంటిమెంట్స్ ను బ్రేక్ చేసిందని చెప్తున్నారు. మహేష్ నటించిన సినిమాలలో ఒక్క ‘మహర్షి’ తప్ప, మేలో విడుదలైన మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

సినిమా రిలీజ్ డేట్ ను సెంటిమెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రకటించగా, ఈ ఒక్క సాంగ్ లెక్క కాదనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావన. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న కీర్తి సురేష్ ను ‘కళావతి’ పేరుతో మహేష్ ఎలా కీర్తించాడో తెలియాలంటే మరో వారం వెయిట్ చేయాలి. కనీసం శాంపిల్ తెలియాలన్నా మరో నాలుగు రోజులైనా నిరీక్షించాల్సిందే.