Vijaysai-Reddy-Sarath-Chandra-Delhi-Liquor-Scamఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నప్పటికీ ఆంద్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మీద తన పట్టుకోల్పోలేదు. ఏసీఏ అధ్యక్షుడుగా ఆయన ఎన్నికకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

గత నెల నవంబర్‌ 18వ తేదీన మాజీ ఐఏఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి అధ్వర్యంలో ఏసీఏ ప్యానల్ ఎన్నికలు జరిగాయి. వాటిలో అధ్యక్ష పదవితో సహా మిగిలిన 5 పదవులకి శరత్ చంద్రరెడ్డి బృందం మాత్రమే నామినేషన్లు వేయడంతో వారి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రమాకాంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆ ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో ఏసీఏ ఫలితాలు ప్రకటించకుండా న్యాయస్థానం స్టే విధించింది. ఆ తర్వాత తెర వెనుక ఏం ఒత్తిళ్ళు జరిగాయో ఏం మంతనాలు జరిగాయో తెలీదు కానీ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో వేసిన ఆ పిటిషన్‌ని ఉపసంహరించుకొంది. దాంతో హైకోర్టు జస్టిస్ సి.మానవేంద్ర రాయ్ ఎన్నికల ఫలితాలపై స్టేని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్టు స్టే ఎత్తివేసినందున ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా శరత్ చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పి.రోహిత్ రెడ్డి ఎన్నిక ఖరారు అయ్యింది. ఏసీఏ కార్యదర్శి: గోపీనాధ్, సంయుక్త కార్యదర్శి: ఏ.రాకేష్, కోశాధికారి: ఏ వెంకటాచలం, కౌన్సిలర్: కేవీ పురుషోత్తమరావు ఎన్నికయ్యారు.

శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలలో, ట్రైడెంట్ లైఫ్ సైన్సస్ అనే మరో కంపెనీలో డైరెక్టరుగా ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో శరత్ చంద్ర రెడ్డిని గత నెల 10వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచు జైల్లోనే ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సీబీఐ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కూడా శరత్ చంద్ర రెడ్డి ప్రధాన నిందితులలో ఒకరని పేర్కొంది. ఈ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి కీలకసూత్రధారులని పేర్కొంది.

ఇటువంటి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న శరత్ చంద్ర రెడ్డి స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకొంటే హుందాగా ఉంటుంది. కాదని కొనసాగితే ఆయన చేతిలో ఏసీఏ క్లీన్ బౌల్డ్ అయినట్లే భావించవచ్చు.