Sapthagiri Hero Vs Comedianకమెడియన్ గా స్థిరపడాల్సిన సమయంలో హీరో వేషాలు వేస్తూ… టాలీవుడ్ టాప్ కమెడియన్ చైర్ అవకాశాన్ని చేజేతులా చేజార్చుకునే విధంగా సప్తగిరి అడుగులు వేస్తున్నట్లుగా కనపడుతోంది. సునీల్ హీరోగా వెళ్ళిన తర్వాత ఆ స్థానాన్ని సుస్థిరంగా ఎవరూ దక్కించుకోలేకపోయారు. మరో వైపు టాలీవుడ్ టాప్ కమెడియన్స్ ఎంఎస్ నారాయణ, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం… ఇలా అందరూ వరుసగా కాలం చేయడంతో… ఒక్కసారిగా కమెడియన్ల కొరత ఏర్పడింది.

ఈ తరుణంలో… ప్రేక్షకుల ఆదరణను నెగ్గిన కమెడియన్ గా సప్తగిరి పేరు బాగా వినిపించింది. అందుకు తగ్గట్లే… వరుసగా ‘ప్రేమకధాచిత్రమ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లవర్స్’ వంటి సినిమాలలో అద్భుతమైన కామెడీని పండించి సినీ అభిమానుల మనసు దోచుకున్నాడు. అయితే సునీల్ మాదిరి తను కూడా హీరో అయిపోవాలని భావించాడో ఏమో గానీ, ఒక్కసారిగా కామెడీ వేషాలు తగ్గించి “సప్తగిరి ఎక్స్ ప్రెస్” ద్వారా హీరో అవతారం ఎత్తాడు. ఈ సినిమా ఆడియోకు పవన్ కళ్యాణ్ విచ్చేయడంతో కావాల్సిన పబ్లిసిటీ కూడా దక్కింది.

దీంతో సప్తగిరి తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడం ఖాయం అని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. పవన్ ప్రమోట్ చేసినా, సినిమా పర్లేదు అన్న టాక్ వచ్చినా… ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ధియేటర్ల వైపుకు ప్రేక్షకులు కన్నెత్తి చూడలేదు. పర్యవసానం… ఇటు హీరోగా చేసిన సినిమా పరాజయం పాలు కావడం, అటు కమెడియన్ గా అవకాశాలు కోల్పోవడం జరిగి, సప్తగిరి రేసులో వెనుకబడిపోయాడు. అయితే జరిగిన తప్పును తెలుసుకుని, ఇక మున్ముందు కామెడీ వేషాలు వేస్తారని భావించిన ఆడియన్స్ కు మరో షాక్ ఇచ్చాడు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “జాలీ ఎల్.ఎల్.బి.” చిత్రాన్ని తెలుగులో “సప్తగిరి ఎల్.ఎల్.బి.”గా రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించి గురువారం నాడు కొబ్బరికాయ కొట్టారు. రవికిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు చరణ్ లక్కాకుల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కలిసుందాం రా, ప్రేయసి రావే, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ’ వంటి సినిమాలకు పని చేసిన చరణ్ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ ద్వారా దర్శకత్వ శాఖలో అడుగుపెట్టాడు. మరి రెండవ ప్రయత్నంలో అయినా సప్తగిరి ప్రేక్షకుల ఆదరణ పొందుతాడో లేదో చూడాలి.