Sankranti Theaters Controversy Chiranjeevi Balayya Fans Argumentsఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని పాత సామెత ఒకటుంది. సంక్రాంతి థియేటర్ల పంచాయితీ చూస్తుంటే అచ్చం ఇదే గుర్తొస్తోంది. విజయ్ వారసుడుకి ఎక్కువ స్క్రీన్లు వచ్చేలా నిర్మాత దిల్ రాజు కదుపుతున్న పావుల పట్ల ఏకంగా ఫిలిం ఛాంబర్ స్పందించి విన్నపం చేసినా ఆయన మాత్రం తన మానాన తాను అగ్రిమెంట్ చేసుకుంటూ ఏదీ పట్టించుకునే స్థితిలో లేరని ట్రేడ్ లో గుసగుస. తన మీద వస్తున్న కామెంట్లకు సమాధానమన్నట్టుగా ఏబిఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అనుకూలంగా చెప్పుకున్న వెర్షన్ తప్ప వాస్తవిక కోణంలో స్ట్రెయిట్ సినిమాలకు దక్కాల్సిన ప్రాధాన్యం గురించి అసలేం మాట్లాడలేదన్న ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ఇప్పటికే నిప్పు ఉప్పులా ఉన్న చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య ట్విట్టర్ యుద్ధం దీని వల్ల కొత్త రంగు పులుముకుంటోంది. ముందు మెగాస్టార్ ఫ్యాన్స్ వెర్షన్ చూస్తే వీరసింహారెడ్డి డిసెంబర్ రిలీజ్ కు అనుగుణంగానే షూటింగ్ చేసుకుంటూ వచ్చారని, ఎప్పుడైతే వాల్తేర్ వీరయ్య ఒక్కటే పండగ బరిలో పెద్ద సినిమా అని అర్థమయ్యిందో అప్పటి నుంచి బాలయ్యే నిర్ణయం మార్చుకుని మైత్రి మేకర్స్ కి హుకుం జారీ చేశారట. లేకపోతే డిసెంబర్ 23కి ఏ సమస్యా లేకుండా బాలకృష్ణ బొమ్మ పడిపోయేదని అంటున్నారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. వీరయ్య సంక్రాంతికి లాక్ చేశాకే వీరసింహారెడ్డిని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ ముందుగానే జరిగింది.

తర్వాత అంతర్గత పరిణామాల వల్ల సీన్ మొత్తం మారిపోయింది. ఇక నందమూరి అభిమానుల వాదన ఇంకోలా ఉంది. ఏడాది మొత్తంలో బాక్సాఫీస్ కు కీలకమైన పండగలు సంక్రాంతి, దసరా, దీపావళిలు మాత్రమే. ఉగాది సెలవులు తక్కువగా ఉన్న దృష్ట్యా అంత అనుకూలంగా ఉండదు. అలాంటప్పుడు అన్నీ చిరంజీవికే కావాలంటే ఎలా అనేది వాళ్ళ కౌంటర్. విజయదశమిని గాడ్ ఫాదర్ కోసం వాడేసుకుని మూడు నెలలు తిరక్కుండానే మళ్ళీ డిమాండ్ చేస్తే ఎలా అంటున్నారు. అయినా ఈ సీజన్ లో పోటీ పడటం కొత్తేమి కానప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ ఆర్గుమెంట్లు ఎందుకనేది ప్రశ్న. సరే ఎవరి కోణం వారిది. కాసేపు అందరూ కరెక్టే అనుకుందాం.

రెండు సినిమాలకు మైత్రినే నిర్మాత కావడంతో సహజంగానే డిస్ట్రిబ్యూటర్లు ఒకరే అవుతారు. అలాంటప్పుడు థియేటర్లు సర్దడమనేది పెద్ద తలనెప్పిగా మారుతుంది. దిల్ రాజు కాదని వారసుడుని నిలువరించడం అసాధ్యం. దానికి ఎక్కువ కౌంట్ వచ్చినా నిలదీసేదెవరు తప్పని చెప్పేదెవరు. కేవలం నోటిమాటగా నైతికం కాదని చెప్పడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. ఒకవేళ వీరయ్య, వీరసింహాలలో ఒకరే వచ్చి ఏజెంట్ లేదా ఆది పురుష్ ఉన్నా పంపిణీదారులు మారతారు కాబట్టి ఇంత గొడవ ఉండదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిన మైత్రి సంకటస్థితి ఇంకో నెలన్నర దాకా దినదిన గండంగానే ఉండనుంది.