sankranthi season theatres games started who will winకాలం మెట్రో ట్రైన్ స్పీడ్ లా పరిగెత్తుతోంది. సంక్రాంతికి ఇంకా టైం ఉందన్నట్టు అనిపిస్తున్నా లెక్కేసుకుంటే పట్టుమని ముప్పై అయిదు రోజులు కూడా లేవు. పండగ సీజన్ కి టార్గెట్ చేసుకున్న సినిమాల బిజినెస్ వ్యవహారాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. వారసుడు కన్నా వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి స్ట్రెయిట్ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ కోరితే దిల్ రాజు చాలా తెలివిగా ఇండస్ట్రీ లోతుపాతులు అంతగా తెలియని ఏబిఎన్ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైపు సమర్ధించుకునే ప్రయత్నం తప్ప నిజంగా సమస్య పట్ల స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. పోనీ మీడియాకు దొరుకుతున్నారా అంటే ప్రశ్నలు అడిగేంత టైం ఇవ్వడం లేదు.

తెరవెనుక థియేటర్లు సంబంధించిన అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. అజిత్ తునివు(తెగింపు టైటిల్ ప్రచారంలో ఉంది) కూడా రేస్ లోకి వచ్చేసింది. దీంతో కలిపి మొత్తం నాలుగయ్యాయి. సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం సైతం దించే ఆలోచనలో యువి సంస్థ ఉన్నట్టు వచ్చిన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. వర్షం లేనిదే నేల తడవదుగా. ఏదో ఒక ఆధారంతోనే ఈ లీకు బయటికి వదిలారు. ఇదీ నిజమైతే కౌంట్ టోటల్ అయిదుకు చేరుకుంటుంది. అసలు ఇన్నేసి సినిమాలలకు సర్దుబాటు ఎలా చేస్తారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. బిసి సెంటర్లలో అయిదారు థియేటర్లున్న చోట్ల చిరంజీవి బాలకృష్ణలకు ఒకొక్కటి వస్తే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు.

అలా చేసినా కూడా వాటిని చూసేందుకు వచ్చే జనానికి అవి ఏ మూలకు సరిపోవు. అప్పుడు వచ్చే ఓవర్ ఫ్లోస్ వారసుడు, తెగింపులకు షిఫ్ట్ అవుతాయి. నగరాల్లో ఈ సమస్య లేదు కానీ పట్టణాలు, గ్రామాల్లో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది ఒక ఎత్తైతే గేమ్ కొత్త మలుపులు తిరుగుతోంది. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35 ఎంఎం వారసుడుకి, దేవి 70 ఎంఎం తెగింపుకి బుక్ చేశారన్న టాక్ తో చిరు బాలయ్య అభిమానులు భగ్గుమంటున్నారు. ఇది వాస్తవమైతే సంధ్య 35, 70లు వీరయ్య వీరసింహాలకు దక్కుతాయి. ఇదెంత అన్యాయమో సగటు భాగ్యనగర మూవీ లవర్స్ అందరికీ తెలుసు. ఇక్కడే కాదు వైజాగ్, విజయవాడలాంటి చోట్లా ఇదే పరిస్థితి ఉందట

ఇదెలా ఉందంటే ఓ పెద్దమనిషి పేకాటలో కావాల్సిన ముక్కలన్నీ తీసుకుని మిగిలినవి పంచేసి ముందు నేను ఏరుకున్నాను కాబట్టి గెలుపు నాదే అని అంటే ఎలా అనిపిస్తుంది. అచ్చంగా ఇదే జరుగుతోందని బయ్యర్లు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. నేనెవరినీ బలవంతం చేయడం లేదని, నాకున్న పరిధిలో మాత్రమే వారసుడుని రిలీజ్ చేస్తున్నానని చెబుతున్న దిల్ రాజు అది నిజమని రుజువు చేయాలంటే ఏరియాల వారీగా ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఏవేవి ఇస్తున్నారో లిస్టు బయటికి వస్తే తప్ప తేలదు. అది ఇప్పట్లో జరగని పని. ఏ జనవరి రెండో వారానికో తప్ప అంతకన్నా ముందు వదిలే ఛాన్స్ లేదు. మైత్రి వాళ్ళు స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అయితే పెట్టుకున్నారు కానీ దానివల్ల జరుగుతున్న మేలేంటో త్వరలోనే తేలనుంది.