KGF-Chanpter-2కేజీఎఫ్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు యశ్‌. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌’ చాప్టర్‌ 2ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌ను చిత్రబృందం ఈరోజు ఉదయం విడుదల చేసింది. ఈరోజు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన పాత్ర పేరు అధీర. కోలార్ బంగారు సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ సోదరుడి పాత్రలో అధీర కనిపిస్తాడని వినికిడి.

తలపాగా చుట్టుకుని కళ్లు మాత్రమే కనిపించేలా ఉన్న పోస్టర్ తో సంజయ్ దత్ పూర్తి లుక్ చూపించకపోయినా ఆ పాత్ర కళ్ళలో కర్కశత్వం బట్టి సినిమాలో ఆ పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడంతో సినిమాకు బాలీవుడ్ లో కూడా హైప్ వస్తుంది. ఈ సినిమాకు కూడా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. హోంబళే ఫిలింస్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

కర్ణాటక లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేసేది ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే వచ్చే ఏడాది వేసవిలో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్ తో పని చేయబోతున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమా కోసం ఇప్పటికే దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.