Sangeetha Chaterjee arrested in red sandal smugglingఎర్రచందనం అక్రమ తరలింపునకు చెక్ పెట్టేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రెడ్’లో భాగంగా కోల్ కతాలో మహిళా డాన్ కం మోడల్ అయిన సంగీతా చటర్జీని అరెస్ట్ చేసారు. అయితే ఈమె వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ నెట్ వర్క్ చూసి పోలీసు వర్గాలే అవాక్కయ్యారట. అంతేకాదు, ఆమె అనుభవించే విలాసవంతమైన జీవితం, పుట్టు పూర్వోత్తరాలు పరిశీలించిన చిత్తూరు పోలీసులు నోరెళ్లబెట్టారట.

ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ గా ఎదిగిన లక్ష్మణ్ కు రెండో భార్యగా ఉన్న సంగీతా చటర్జీ గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన అనుభవముంది. దీంతో పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడిన క్రమంలోనే లక్ష్మణ్ ను వివాహం చేసుకుంది. దరిమిలా ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత సంగీత మోడల్ గానూ రాణించింది. ఇందులో భాగంగా పలు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో దర్శనమిచ్చిన సంగీత, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నిత్యం బార్లు, పబ్బు, క్లబ్బుల వెంట ఖరీదైన కార్లలో హల్చల్ చేసింది.

2014లో లక్ష్మణ్ అరెస్ట్ కావడంతో, తన భర్త నిర్వహిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా బాధ్యతలను కూడా సంగీత తన భుజాన వేసుకుని, అన్నీ తానై వ్యవహారాలు నడిపింది. ఈ క్రమంలో దేశంలోని పలు నగరాల్లోని స్మగ్లర్లే కాక అంతర్జాతీయ స్మగ్లర్లతోనూ డీల్స్ చేసిన సంగీత, విదేశాల నుంచి హవాలా రూపంలోనూ డబ్బు తెప్పించడంలోనూ ఆరితేరిపోయినట్లుగా పోలీస్ వర్గాలు పేర్కొంటున్నారు. ఇలా తెచ్చిన మొత్తాన్ని దేశంలోని పలువురు స్మగ్లర్లకు అందజేసే క్రమంలో… చెన్నైకి చెందిన ఓ స్మగ్లర్ మోజెస్ ద్వారానే 10 కోట్ల మేర చెల్లింపులు జరిపిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సమగ్ర వివరాలు సేకరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తన సిబ్బందిని కోల్ కతా పంపించి సంగీతాను అరెస్ట్ చేశారు.

కోల్ కతా నుంచి సంగీతను చిత్తూరు తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ లో ఎదురైన ఇబ్బందులతో, కోల్ కతా కోర్టులోనే అరెస్ట్ ను చూపగా, తన పలుకుబడిని వినియోగించుకుని కేవలం ఒక్క రోజులోనే బెయిల్ తెచ్చుకుంది. అయితే ఏదేమైనా సంగీతను చిత్తూరుకు తీసుకురావాల్సిందేనని పట్టుదలతో ఉన్న పోలీసులు… ఆమెకు చెందిన పలు కీలక డాక్యుమెంట్లు, పాస్ పోర్టు, ఆరు బ్యాంకు ఖాతాలు, ఓ లాకర్ కీ వంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, మరిన్ని వివరాలు బయటకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 18లోగా ఎలాగైనా సంగీతను చిత్తూరు తీసుకువచ్చేందుకు చిత్తూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరులోని నాలుగు పోలీస్ స్టేషన్లలో సంగీతపై పలు కేసులు నమోదయ్యాయి.