sandra venkata veeraiah caompares KCR with NTRకాసేపటి క్రితం శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై ప్రశంసలు కురిపించడం విశేషం. ఏకంగా కేసీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తో పోల్చడం విశేషం. గతంలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన పలు సంస్కరణలు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో సహకరించాయని చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్ చేసినట్లే ఇప్పుడు కేసీఆర్ కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు.

ముఖ్యంగా గురుకుల విద్యాలయ వ్యవస్థ విషయంలో కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనితో పాటు అప్పుడు ఎన్టీఆర్ మండలి వ్యవస్థను తీసుకువస్తే.. ఇప్పుడు కేసీఆర్ కొత్త జిల్లాలను తీసుకు వచ్చారని చెప్పారు. కొద్ది కాలంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారని వార్తలు వస్తున్నాయి. దీనితో ఆయన ఇలా మాట్లాడడం ఆ వార్తలకు బలం చేకూర్చినట్టు అయ్యింది. ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సండ్రను టీటీడీ బోర్డులో నియమించింది.

అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జాయిన్ అవ్వుదామని నిర్ణయించుకున్న సండ్ర ప్రమాణస్వీకారం చెయ్యలేదు. టీటీడీ రాజ్యాంగం ప్రకారం నెల రోజుల లోపు ప్రమాణస్వీకారం చెయ్యకపోతే పదవి పోయినట్టే. ఆ విధంగా సండ్ర టీడీపీ ఇచ్చిన పదవి తీసుకోకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన స్థానంలో ఇప్పటికే మరొకరిని నియమించేసింది కూడా. తొందరలోనే సండ్ర గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.