Sampath Nandi - Goutham Nanda ‘ఏమైంది ఈ వేళ’ వంటి చిన్న సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ తో ‘రచ్చ’ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన సంపత్ నంది, ఆ తర్వాత రవితేజతో “బెంగాల్ టైగర్” సినిమా తీసి కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం కమర్షియల్ కోణంలో తీసిన ఈ సినిమాలన్నీ నిర్మాతలకు కాసులు కురిపించాయి గానీ, దర్శకుడిగా సంపత్ నంది ప్రతిభను చాటలేకపోయాయి. కానీ మరికొద్ది గంటల్లో విడుదల అవుతోన్న “గౌతమ్ నంద” సినిమా ఆ ముచ్చట తీరుస్తుందని స్వయంగా సంపత్ ఒప్పుకున్నారు.

గత చిత్రాలలో తాను బలమైన కధను చెప్పలేకపోయానని, కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లోపాన్ని సవరించుకున్నానని, ఈ ఏడాది విడుదలైన సినిమాలలో టాప్ 10 కధల్లో ఖచ్చితంగా ‘గౌతమ్ నంద’ కూడా నిలుస్తుందని, బ్లాక్ బస్టర్ సక్సెస్ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాడు సంపత్. ఇప్పటివరకు రానటువంటి మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాంమని, ఘట్టమనేని గౌతమ్ గా ఉండే వ్యక్తి ‘గౌతమ్ నంద’గా ఎలా మారాడు అన్నదే సినిమా కాన్సెప్ట్ అని క్లుప్తంగా తెలిపారు.

ఇక ‘సర్ నేమ్’గా ఘట్టమనేని అని పెట్టడానికి ఓ కారణముందని… సమాజంలో ఆ పేరుకు ఓ గౌరవం ఉందని, అలాగే ఆ ఫ్యామిలీతో ఉన్న వారు గొప్ప స్థానంలో ఉన్నారని, అలాంటి పేరు పెట్టగానే హీరోను కూడా ప్రేక్షకులు అంగీకరిస్తారనే ఫీలింగ్ తో హీరో క్యారెక్టర్ పేరు గౌతమ్ ఘట్టమనేనిగా పెట్టినట్లు స్పష్టం చేసారు. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కూడా అభినందించారని, ముఖ్యంగా ఇద్దరు మహిళలకు అయితే బాగా నచ్చిందని, ప్రేక్షకులకు కూడా అంత బాగా నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు సంపత్ నంది.