Same Incident Repeat in Nelloreసుమారు పది రోజుల క్రితం తిరుపతి రూయా హాస్పిటల్‌లో ఓ పదేళ్ళ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. రాత్రి 11 గంటలకు బాలుడి మృతదేహాన్ని 90 కిమీ దూరంలో ఉన్న స్వగ్రామానికి తరలించవలసి వచ్చింది. హాస్పిటల్‌లో అంబులెన్సు అందుబాటులో ఉంది కానీ బయట ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు దానిని అడ్డుకొన్నారు.

అప్పుడు కొడుకు మృతదేహాన్ని భుజాన్న పెట్టుకొని ఆ బాలుడి తండ్రి తమ బందువుతో కలిసి అర్ధరాత్రి పూట 90 కిమీ మోటార్ సైకిలుపై ప్రయాణించవలసి వచ్చింది. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం అవడంతో పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేసుకొని మమ అనిపించేశారు.

నెల్లూరు జిల్లా సంగంలో మళ్ళీ అటువంటి విషాద ఘటన పునరావృతమైంది. ఈశ్వర్ (10), శ్రీరామ్ (8) అనే ఇద్దరు పిల్లలు బుదవారం కనిగిరి జలాశయంలో మునిగి చనిపోయారు. వారిలో శ్రీరామ్ ఇంకా కొన ప్రాణంతో ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు తక్షణం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. కొద్ది సేపటికే బాలుడు మృతి చెందాడు.

దాంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని సిబ్బందిని బ్రతిమాలుకొన్నాడు. కానీ మహా ప్రస్థానం వాహనం అందుబాటులో లేదని వారు చెప్పారు. అక్కడే ఉన్న 108 వాహనంలోనైనా తరలించాలని వేడుకొన్నాడు. కానీ అది నిబందనలకు విరుద్దమని చెప్పి పంపేశారు.

దాంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని భుజాన్న వేసుకొని బయటకు వచ్చి ఆటోవారిని ప్రాధేయపడ్డాడు. కానీ మృతదేహాన్ని తీసుకువెళ్ళేందుకు వారు కూడా అంగీకరించలేదు. ఇక గత్యంతరం లేక ఇంటి నుంచి మోటార్ సైకిల్‌ను రప్పించి దానిపైనే కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళారు.

హృదయవిదారకమైన ఇటువంటి ఘటనలు యూపీ, బిహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాలలో అప్పుడప్పుడు జరిగినట్లు వార్తలలో వింటుంటాము. కానీ ఇప్పుడు మన ఏపీలోనే ఇటువంటివి తరచూ జరుగుతుండటం విస్మయం కలిగిస్తుంది.

నాడు-నేడు కార్యక్రమంలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌కు సకల సౌకర్యాలు కల్పించి కోట్లు ఖర్చు పెట్టి అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు, 108 వాహనాలు కొన్నామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే మరి ఈవిదంగా ఎందుకు జరుగుతోంది? జరిగితే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?

ఒకసారి జరిగితే పొరపాటు కానీ మళ్ళీ మళ్ళీ జరిగితే అది అలవాటు. వెనకబడిన రాష్ట్రాల సరసన ఏపీని నిలబెడుతున్నందుకు ప్రజలు సంతోషించాలేమో?