Samantha Yashoda movie do audiences come theaters with empathyఏ భాషలో అయినా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా రావు. ఎందుకంటే ఇది హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ. కథానాయకుడి ఇమేజ్ మీద బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు ఎందుకొచ్చిన రిస్క్ లెమ్మని అలాంటి కథలు రాసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. వాటిని మోయగలిగే ఆర్టిస్టులు, జనాన్ని థియేటర్ కు లాక్కురాగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కావాలి. ఉదాహరణకు పూజా హెగ్డే కెరీర్ పరంగా టాప్ లో ఉన్నా తనను పెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కర్తవ్యం లాంటి సినిమా ప్లాన్ చేశారనుకోండి ఆ ఊహకే నవ్వొస్తుంది. తనతో బలంగా పోటీ పడుతున్న రష్మిక మందన్నతో అంకురం లాంటి సీరియస్ సబ్జెక్టు తీస్తే డిజాస్టర్ ఖాయం.

ఇలాంటివివి అందరికీ సాధ్యం కావు. అరుంధతితో బ్లాక్ బస్టర్ సాధించిన అనుష్కను సైతం తర్వాత ఆ తరహా పాత్రలతో చేసిన పంచాక్షరీ లాంటి సినిమాలను జనం చూడకలేకపోయారు. విజయశాంతి ముప్పై ఏళ్ళ క్రితం లేడీ అమితాబ్ అనిపించుకుని ఒక దశ దాటాక మళ్ళీ చిరంజీవి బాలకృష్ణలతో డాన్సులు వేయక తప్పలేదు. ఇప్పుడు సమంతా వంతు వచ్చింది. యశోదను కేవలం తన బ్రాండ్ మీద బిజినెస్ చేశారు. ఎన్ని కోట్లనేది పక్కనపెడితే రేపు మార్నింగ్ షోకి హౌస్ ఫుల్ బోర్డు పడిందంటే దానికి కారణం తనొక్కర్తే అవుతుంది. లేదూ ఏదైనా తేడా జరిగిందా సాయంత్రానికి పడిపోయే కలెక్షన్ల బాధ్యతను సామ్ తో పాటు దర్శకులు పంచుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం తన అనారోగ్య స్థితిని లెక్క చేయకుండా యశోద కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత కష్టం అందరికీ కనిపిస్తుంది. కానీ కేవలం ఆ సానుభూతి కోణంలో ఆడియన్స్ థియేటర్లకు రారు. ఇక్కడా టాకే ముఖ్యం. ఫ్యాన్స్ మహా అయితే మొదటి రెండు ఆటలకు సందడి చేయగలరు కానీ అంతకు మించి అంటే మాత్రం సినిమాలో మ్యాటరే మాట్లాడాలి. ఇంతకు ముందు చైతు అభిమానుల సపోర్ట్ ఉండేది. విడాకుల తర్వాత అదీ తగ్గిపోయింది. ఓ బేబీ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సామ్ తో యశోద, శాకుంతలం లాంటి పెద్ద ప్రాజెక్టులను తీసేందుకు నిర్మాతలను పురికొల్పుతోంది. రేపు బొమ్మ సూపర్ హిట్ అంటే టెన్షన్ ఎంతో కొంత తగ్గినట్టే, ఇక శామ్ పూర్తిగా రికవర్ అవడమే లేట్.

ఇప్పుడీ యశోద ఫలితం మీదే శాకుంతలం బిజినెస్ ఆధారపడి ఉంది. దర్శకుడు గుణశేఖర్ సామ్ మార్కెట్ కెపాసిటీని మించి ఖర్చు పెట్టారు. వాయిదా వేయడానికి త్రీడి ఎఫెక్ట్స్ అని చెప్పారు కానీ వాస్తవానికి సమంతా పూర్తిగా కోలుకుని మునుపటిలా వస్తే తప్ప రిలీజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్లలో తను చాలా కీలకం పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకున్నాక సహజంగా ఏ హీరోయిన్ కెరీర్ అయినా బాగా డౌన్ అయిపోతుంది. కానీ దానికి భిన్నంగా సామ్ మాత్రం మంచి అవకాశాలతో కెరీర్ ని ప్లాన్ చేసుకుంటోంది. మరి పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఎదురవుతున్న సవాళ్లకు యశోద ఎలాంటి ఊతమిస్తుందో చూడాలి.