salman khan flash backబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ “హిట్ అండ్ రన్” కేసు నుండి దాదాపుగా బయటపడ్డట్లే. “ఈ కేసులో సల్మాన్ ను దోషిగా నిర్ణయించలేమంటూ బాంబే హైకోర్ట్ తీర్పు ఇవ్వడంతో సల్మాన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సల్మాన్ పై ఉన్న అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, విచారణ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బ్లడ్ శాంపిల్ సేకరణ వంటి కీలక సాక్ష్యాలో విభిన్నత ఉందని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో ట్రయిల్ కోర్టు విధించిన అయిదేళ్ళ జైలు శిక్ష నుండి సల్మాన్ బయటపడ్డట్లేనని బాలీవుడ్ వర్గాలు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

బాంద్రాలోని హిల్ రోడ్ లో గల బేకరీ సమీపంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న అయిదుగురి పైకి కారు ఎక్కించిన ఘటనలో సల్మాన్ పై కేసు నమోదయ్యింది. 2002, సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో సల్మాన్ ఆల్కహాల్ సేవించి కారు నడిపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ కేసు నుండి బయటపడడం సల్మాన్ కే కాదు, అభిమానులకు, బాలీవుడ్ నిర్మాతలకు కూడా సంతోషాన్ని కలిగించే అంశం. ముఖ్యంగా క్రింది కోర్టు అయిదేళ్ళ జైలు శిక్ష విధించిన నేపధ్యంలో బాంబే హైకోర్ట్ తీర్పు పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.

ఇదంతా ఒకెత్తు అయితే… ఇంతకీ ఈ కేసులో ‘న్యాయం’ జరిగినట్లేనా..! హైకోర్ట్ వెల్లడించిన వ్యాఖ్యల బట్టి చూస్తే ఖచ్చితంగా కాదని చెప్పవచ్చు. సల్మాన్ ను దోషిగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయ్యిందని చెప్పింది తప్ప, సల్మాన్ నిర్ధోషి అని తేల్చి చెప్పలేదు. దీన్ని బట్టి ఈ కేసులో విచారణ ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. సల్మాన్ ను ఒక సినీ సూపర్ స్టార్ గా కాకుండా, ఒక సామాన్య పౌరుడిగా ఆలోచిస్తే… ‘న్యాయం’ ఏ పాటిదో అర్ధం అవుతుంది.