salary hike for MLA MLC Telangana తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాన్ని పెంచుతూ తీసుకువచ్చిన బిల్లును మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేల వేతనాన్ని ప్రస్తుతమున్న 95 వేల నుంచి 2.58 లక్షలకు పెంచుతున్నట్టు ప్రతిపాదించారు. హెచ్ఆర్ఏను 25 వేల నుంచి 50 వేలకు, బేసిక్ ను 20 వేలు పెంచుతున్నట్టు ప్రకటించారు. స్పెషల్ కార్ సెక్యూరిటీ అలవెన్స్ గా 25 వేలు జోడిస్తున్నామని, నియోజకవర్గ స్పెషల్ అలవెన్స్ ను 83 వేలకు పెంచుతున్నామని ఆయన తెలిపారు. వేతనాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై 42.67 కోట్ల అదనపు భారం పడనుందని హరీశ్ వివరించారు. ఈ బిల్లుకు మూజువాణీ ఓటుతో అసెంబ్లీ ఆమోదం పలికింది.

అయితే తెలంగాణా రాష్ట్రం ఉన్న పరిస్థితుల రీత్యా ప్రజా ప్రతినిధుల జీతాలు పెంచడంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకపోయినప్పటికీ, దానికి అనుగుణంగా సామాన్యుడి జీవన శైలి కూడా పెంచాలనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సామన్య ప్రజానీకం కోరుకుంటోది. ప్రజాప్రతినిధులుగా మారిన తర్వాత ఎక్కువ శాతం మంది నేతలు తమ ఆస్తులను కూడపెట్టుకోవడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. అయిదు సంవత్సరాలలోనే ఒక్కొక్కరి ఆదాయం… జీవనశైలి… ఇలా ఒక్కటేమిటి అన్ని విభాగాల్లో భారీ మార్పులు చూస్తూనే ఉంటాం. అలాగే, సదరు నాయకుల బంధువుల, మిత్రుల స్థాయిలలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, సదరు నాయకులను ఎన్నుకున్న ప్రజానీకంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు.

ఇటువంటి వారి కోసం కూడా జీ.వోలు తీసుకువచ్చి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఏ మాత్రం ఉందో ప్రభుత్వమే పునరాలోచించుకోవాలనేది సగటు సామాన్యుడి ఆవేదన. భారీ స్థాయిలో జీతాలు పెరిగాయి కదా అని ప్రజాప్రతినిధుల అవినీతి సంపాదనకు బ్రేకులు పడతాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే!