Sakshi TV tweets Paracetamol curing coronavirus in keralaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏదో ఒక పథకం పేరుతో ఖజానా ఖాళీ చేస్తూ ప్రజలలో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రం నుండి పెట్టుబడులు తరలిపోతున్నా, కొత్త పెట్టుబడులు తేలేకపోతున్నా అవేమీ ప్రజలకు అర్ధం కాకుండా సంక్షేమ పథకాలతో మేనేజ్ చేస్తున్నారు.

అయితే ఇటీవలే స్థానిక ఎన్నికల వాయిదా గురించి ముఖ్యమంత్రి పెట్టిన ప్రెస్ మీట్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద విరుచుకుపడ్డారు. కుల రంగు పూశారు. చంద్రబాబు తొత్తు అన్నారు. అసలు కరోనా అనేది పెద్ద విషయమే కాదు అన్నట్టు మాట్లాడారు.

కేవలం పారాసిట్‌మాల్‌ మందు (జ్వరానికి వాడే మందు) వాడితే తగ్గిపోయే జబ్బు అది అని చెప్పుకొచ్చారు. దీనితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రాల్స్ మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఇంతగా అవకాశం ఇచ్చింది లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది… పారాసిట్‌మాల్‌ తో కరోనా తగ్గిపోతుంది అని నిరూపించడానికి సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ శతవిధా ప్రయత్నించడం విశేషం.

తాజాగా సాక్షి… ‘పారాసిట్‌మాల్‌తో అద్భుత ఫలితం. బాధితులపై పారాసిట్‌మాల్‌ ప్రయోగించిన కేరళ. పూర్తిగా అదుపులోకి వస్తోందంటున్న వైద్యులు. పారాసిట్‌మాల్‌తో విజయం సాధిస్తున్న కేరళ. కేరళ బాటలో మరిన్ని రాష్ట్రాలు,” అంటూ ఒక కథనం ప్రసారం చేసింది. ప్రజలు ఆ తప్పుని మర్చిపోయేలా చెయ్యాల్సింది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. పైగా కరోనా పారాసిట్‌మాల్‌ తో తగ్గే చిన్న జబ్బు అన్నట్టు తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు.