Sakshi news targets chandrababu naidu on his assetsప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా చంద్రబాబు కుటుంబం తమ ఆస్తులను ప్రకటించింది. కుటుంబ సభ్యులు అందరివీ కలిపి 102.49 కోట్ల నికర ఆస్తులు ఉన్నట్టుగా ప్రకటించారు. ఇందులో చంద్రబాబుకు 3.87 కోట్లు, ఆయన సతీమణికి 50 కోట్లు, లోకేష్ కు 24 కోట్లు, ఆయన సతీమణి బ్రాహ్మణికి 15 కోట్ల 68 లక్షలు… దేవాన్ష్‌ ఆస్తి.. 19 కోట్ల 42 లక్షలుగా చూపించారు.

ఇది ఇలా ఉండగా మీడియా అంతా దీనిని బాగా హైలైట్ చేసింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా మాత్రం… తాత ఆస్తి కంటే మనవడి ఆస్తి విలువే ఎక్కువ అని ప్రముఖంగా ప్రచురించారు. సాక్షి అయితే ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఆస్తులు తగ్గించి చూపారని, పైకి మాత్రం భార్య సంపాదన మీదే జీవనం సాగిస్తున్నా అంటూ చంద్రబాబు చెబుతూ ఉంటారని ఎద్దేవా చేశారు.

ఒంటి మీద పదేళ్లు కూడా లేని పిల్లోడికి 20 కోట్ల ఆస్తి ఉండటం అంటే అవినీతి కాక ఏమిటి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ప్రచారం చెయ్యడం గమనార్హం. అయితే నిపుణులు మాత్రం ఈ వాదనలో పసలేదని అంటున్నారు. “తల్లిదండ్రులు, తాతయ్యలు తమకంటే పిల్లల పేరిట ఎక్కువ ఆస్తులు పెట్టుకోవడం ఎక్కడా లేనిది కాదు,” అని వారు చెప్పుకొస్తున్నారు.

“చంద్రబాబు కుటుంబానికి వ్యాపార నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ముత్తాత (ఎన్టీఆర్) నుండి సంక్రమించిన ఆస్తులు కూడా దేవాన్ష్ కు వస్తాయి. వేరే ఆదాయవనరులు లేవు కాబట్టి అవినీతి చేశారు అంటే ఏమో అనుకోవచ్చు. అయితే దేవాన్ష్ విషయంలో అలా కాదని తెలుస్తూనే ఉంది కాబట్టి అవినీతి నిరూపించే వరకూ ఇవన్నీ పసలేని రాజకీయ ఆరోపణలే,” అని వారు అంటున్నారు.