KTR Sakshiఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నాయో చెప్పుకోవాలంటే ఓ పుస్తకమే వ్రాయాలి. ప్రభుత్వం తీరు చూస్తే అవి తగ్గకపోగా ఇంకా పెరిగేలాగే ఉన్నాయి. కనుక ఇరుగు పొరుగు రాష్ట్రాలని అదీ…శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని వేలెత్తి చూపి విమర్శిస్తే మళ్ళీ నవ్వులపాలయ్యేది మన ప్రభుత్వం..మన రాష్ట్రమే!

ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం టీకప్పులో తుఫానులా చల్లారిపోయింది. కనుక మళ్ళీ ప్రస్తావన చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే, కయ్యానికి కాలు దువ్వుతున్నట్లే కదా? వైసీపీ మనసాక్షికి అద్దం పట్టే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అదే చేశారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై “మాట జారిన కేటీఆర్‌… తదుపరి సర్దుకొన్నా తప్పని డ్యామేజీ” అనే శీర్షికతో వ్రాసిన ఓ ఆర్టికల్ సాక్షి మే9వ తేదీన ప్రచురించారు. దానిలో తెలంగాణ ప్రభుత్వ అసమర్ధత, వైఫల్యాలు, లోపాలు, ఆ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, విద్యుత్‌ కోతల గురించి వ్రాసి, భావి ముఖ్యమంత్రి కేటీఆర్‌ కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

అలాగే వైసీపీ అధికార పత్రికగా భావింపబడుతున్న సాక్షిలో ఈరోజు ఆన్‌లైన్‌ సంచికలో ‘తెలంగాణ : బిల్లులు చూస్తే ఫ్యూజులు అవుట్!’ అంటూ మరో ఆర్టికల్ ప్రచురించింది. దానిలో ఆ రాష్ట్రంలో ప్రజలు విద్యుత్‌ ఛార్జీల బాదుడు భరించలేకపోతున్నారంటూ చెప్పుకొచ్చింది.

“మా ఏపీ వ్యవహారాలలో వేలు పెడితే సహించబోము…పెడితే మీకే నష్టం..”అంటూ రెండు రోజుల క్రితమే కొమ్మినేని చేత టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించి, ఇవాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యవహారంలో సాక్షి వేలు పెట్టడం ఎందుకు?సాక్షి మీడియా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నందున అక్కడి సమస్యలను హైలైట్ చేస్తున్నామని సమర్ధించుకోవచ్చు. కానీ ఇటువంటి వార్తల వలన తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు, టిఆర్ఎస్‌ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగితే అవి ఊరుకొంటాయా?

అప్పుడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు మన ప్రభుత్వ అసమర్ధత, రాష్ట్రం దుస్థితి గురించి విమర్శలు గుప్పించకుండా ఉంటారా?వాళ్ళు నోరు విప్పితే పోయేది మన జగనన్న ప్రభుత్వం పరువే కదా?మనం సింగిల్‌ సింహం అనుకొన్నప్పుడు సింహాల గుంపును కెలకడం ఎందుకు?ఆనక తోక తెగిపోయిందని బాధ పడటం ఎందుకు?