sakshi-apologies-to-ap-assemblyసత్యానికి – అసత్యానికి ఒక్క ‘అక్షరం’ మాత్రమే వ్యత్యాసం. అయితే ఆ ఒక్క అక్షరానికి ఉన్న విలువ మొత్తం అర్థాన్నే మార్చేస్తుంది. అంతటి శక్తివంతమైన అక్షరాలను ఉపయోగించేటపుడు కాస్త నిబద్ధత, చిత్తశుద్ధి వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. అయితే ఇలాంటి వాటితో సంబంధమే లేదన్నట్లుగా తన అక్షరాలను పేపర్ పై పెట్టడం జగన్ మీడియా సంస్థ అయిన ‘సాక్షి’ పత్రికకు పరిపాటిగా మారిందని అధికార పక్షం కొన్నాళ్లుగా మండిపడుతోంది.

కాలక్రమేణా తన వైఖరి మార్చుకుంటుందని వేచిచూసిన ఏపీ సర్కార్ కు నిరాశే ఎదురు కావడంతో ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై కధనాలు ప్రచురితం చేసిన సాక్షి దినపత్రికకు నోటీసులు పంపించారు. అసెంబ్లీ వేదికగా జగన్ వెల్లువెత్తిన ఆరోపణలు ఎంత సత్యదూరంగా ఉన్నాయో, సాక్షి కధనాలు కూడా అంతే సత్యదూరంగా ఉన్నాయని ఏపీ సర్కార్ చెప్పిన మాటలు నిజమనిపించే విధంగా ‘సాక్షి’ పత్రిక క్షమాపణ కోరుతూ అసెంబ్లీకి లేఖ రాసింది.

ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. ఈ క్షమాపణలను అసెంబ్లీ పరిగణనలోకి తీసుకుందని చెప్పడంతో ప్రస్తుతం వివాదానికి తెరపడినట్లయ్యింది. అయితే ఇక ముందైనా… కాస్త తన వైఖరి మార్చుకుని ‘అక్షరాల’కున్న విలువ పోగొట్టకుండా ‘సాక్షి’ పత్రిక వ్యవహరిస్తుందని ఆశిద్దాం.