Sajjanar Kumar - Disha case encounter-హైదరాబాద్ వైద్యురాలు దిశ రేప్, మర్డర్ కేసుతో దేశం అట్టుడికిపోయింది. మన ఆడపిల్లలను కాపాడుకోలేని వ్యవస్థపై సామాన్యుడు దండయాత్ర చేసేంత పని చేశాడు. పోలీసు అధికారులు నుండి అధికారంలో ఉన్న వారు సైతం ప్రజల కోపానికి ఉలిక్కి పడ్డారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే? నిర్భయ కేసు నిందితులకు వలే వీరిని కూడా మేపుతారా వంటి ప్రశ్నలు అనేకం.

దీనికి సమాధానంగా ఒక ఎన్కౌంటర్ లో వారిని అంతం చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉన్న కోపం ఒక్క సారిగా పోయి ప్రజలకు ఎక్కడ బడితే అక్కడ జైజైలు కొడుతున్నారు. అయితే జరిగింది సహజమైన న్యాయమా? సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమా? ఆ రాక్షసులకు ఎలాగూ మరణశిక్షే పడేది. పోలీసులు దానిని ముందుకు అమలు చేసారంతే అని కొందరు సమర్థిస్తున్నారు.

ఎన్కౌంటర్ అనేది ఇల్లీగల్. ఒక ఇల్లీగల్ పనికి ప్రజలు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు. పైకి ఇది ప్రభుత్వ విజయంగా కనిపించినా అంతర్లీనంగా వ్యవస్థ వారిని శిక్షిస్తుందని ప్రజలకు నమ్మకం లేక ఎన్కౌంటర్లను సమర్థిస్తున్నారు అనుకోవాలా? కోర్ట్ లో వెంటనే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంటే వారు దీనిని హర్షించరు కదా? కుక్కర్ కు ఒక సేఫ్టీ వాల్వ్ అనేది ఒకటి ఉంటుంది.

ప్రెషర్ ఎక్కువైనప్పుడు అది కొట్టేసి ప్రెషర్ వల్ల కుక్కర్ పేలకుండా ఆపుతుంది. ఎన్కౌంటర్ అనేది పబ్లిక్ కోపం ఎక్కువై పేలకుండా ఆపే ఒక సేఫ్టీ వాల్వ్ వంటిదనే అనుకోవాలి. రేపులు ఆగాలంటే వ్యవస్థ మరింత పటిష్టం కావాలి. ఇటువంటి కేసులలో న్యాయం వెంటనే జరిగేలా చట్టాలు చెయ్యాలి. దోషులకు శిక్ష న్యాయస్థానమే సత్వరమే విధిస్తుందనే నమ్మకం ప్రజలలో కలగాలి. అప్పుడే రేపులు ఆగుతాయి.