Sajjala-Rama-Krishna-Reddyసజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకొని నెలనెలా లక్షల రూపాయలు జీతభత్యాలు చెల్లిస్తోంది. అయితే ఆయన తీసుకొంటున్న జీతానికి న్యాయం చేస్తున్నారా?అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే వివేకాహత్య కేసులో సీబీఐని చంద్రబాబు నాయుడు, వారి మీడియా నడిపిస్తున్నాయన్నట్లు మాట్లాడారు. వారు ఏవిదంగా సూచిస్తే సీబీఐ ఆవిదంగానే ముందుకు సాగుతోందని చాలా విచిత్రమైన ఆరోపణ చేశారు.

వివేకా హత్య కేసులో సీబీఐ సిఎం జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం చిల్లర పనే అని ఎద్దేవా చేశారు. అసలు వివేకాను ఎవరు హత్య చేశారో దర్యాప్తు చేసి కనిపెట్టాలని సీబీఐని డిమాండ్‌పై చేయాల్సిన సజ్జల, సీబీఐని తెర వెనుక నుండి ఎవరు నడిపిస్తున్నారు?వివేకా హత్య కేసులో చంద్రబాబు నాయుడుకి, మీడియాకి ఏం సంబందం ఉంది? అని లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అనడం వితండవాదమే కదా?

ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులనే నిందితులు కోర్టులకు ఈడ్వడం, సీబీఐపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒత్తిడికి గురిచేసేందుకు ప్రయత్నించడం, చంద్రబాబు నాయుడు, మీడియాలను కూడా ఈ కేసులోకి లాగాలని ప్రయత్నించడం వంటివన్నీ అతి తెలివితేటలే తప్ప తెలివైన వాదనలు కాదని అర్దమవుతూనే ఉంది. అయినా చంద్రబాబు నాయుడు చేతిలో సీబీఐ ఉన్నట్లు మాట్లాడటాన్ని ఏమనుకోవాలి?

అసలు అవినాష్ రెడ్డి నేరం చేశారో లేదో కోర్టులు నిర్ణయించాలి. తాను నిర్దోషినని ఆయన కోర్టులో నిరూపించుకోవాలి. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ కేసును విచారిస్తున్నప్పుడు, సజ్జల రామకృష్ణారెడ్డి లేదా మరొకరు ఆయనకు ఏవిదంగా ‘క్లీన్ చిట్’ ఇస్తున్నారు?దానర్దం ఏమిటి?

ఒకవేళ ఆయన నిర్ధోషి అని నమ్ముతున్నట్లయితే ఆయనకు సంఘీభావం తెలుపవచ్చు. కానీ మీడియా ముందుకు వచ్చి ఆయన తరపు న్యాయవాదిలా వాదించాల్సిన అవసరం ఏమిటి?ఒకవేళ వాదించగలననుకొంటే అదేదో కోర్టులో వాదిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ బయట వాదించి ఏం సాధించాలనుకొంటున్నారు?అంటే సీబీఐ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లే, న్యాయమూర్తులపై కూడా ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోవాలేమో?చివరిగా ఒక్క విషయం, ఇటువంటి సమయంలో సజ్జల ఈవిదంగా మాట్లాడుతూ సీబీఐని రెచ్చగొట్టడం వలన నష్టపోయేది ఎవరు? అవినాష్ రెడ్డే కదా?ఇది శల్యసారధ్యం కాదా?