Sajjala Ramakrishna Reddyవివేకా హత్య కేసులో సీబీఐ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తొలిసారిగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడంతో వైసీపీలో కలకలం మొదలైంది. వివేకా హత్య గురించి ఆయన పీఏ ఫోన్‌ చేసి చెప్పకముందే అంటే ఆరోజు ఉదయం 6.15 గంటలకు ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. ఆయనకు ఈ విషయం అవినాష్ రెడ్డి చెప్పారా మరెవరు చెప్పారో తేల్చాసి ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది.

వివేకా హత్యకు కొన్ని గంటల ముందు అంటే అర్దరాత్రి అవినాష్ రెడ్డి చాలాసేపు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడారని, ఆయన ఆ సమయంలో ఎవరితో ఎందుకు మాట్లాడారో తెలుసుకోవలసిన అవసరం ఉందని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. ఈరోజు విచారణలో సీబీఐ న్యాయవాదులు కూడా పాల్గొంటారని తెలియజేసింది.

వివేకా హత్య గురించి జగన్‌కు తెలుసునని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొనడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి స్పందిస్తూ, “ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు చంద్రబాబు నాయుడు, సునీతారెడ్డి, కొన్ని మీడియా సంస్థలు కుట్ర చేస్తున్నాయి. వారి కనుసన్నలలోనే సీబీఐ విచారణ జరుగుతోంది. వారి మీడియా సంస్థలు సీబీఐ ఏమి చేయబోతోందో ముందే వ్రాస్తుంటాయి. సీబీఐ వాటినే అఫిడవిట్‌లో పేర్కొంటోంది. మళ్ళీ అప్పుడు అవి ‘ఇలా జరుగుతుందని మేము ముందే చెప్పామంటూ’ చెప్పుకొంటారు.

వివేక హత్య గురించి సిఎం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అంటూ సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొనడం చాలా చవుకబారుతనం. తద్వారా దీనిని సంచలనంగా మార్చేందుకు సీబీఐ, చంద్రబాబు నాయుడు, వారి మీడియా ప్రయత్నిస్తోంది. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నిస్తున్నవారే ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించాలని పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలో సీబీఐ కూడా భాగస్వామికావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక అసలు ఈ కుట్ర వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది,” అని ఆరోపించారు.

వివేకా హత్య కేసులో సీబీఐ వైసీపీ నేతలనే వేలెత్తిచూపుతోంది కనుకనే సజ్జల ఈవిదంగా వాదిస్తున్నారని చెప్పొచ్చు. అదే వైసీపీ కోరుకొంటున్నట్లుగా సీబీఐ సునీతారెడ్డి లేదా చంద్రబాబు నాయుడునో విచారిస్తున్నట్లయితే, సజ్జల నేడు సీబీఐని వెనకేసుకువస్తూ మాట్లాడేవారు కదా?అంటే మనం కోరుకొన్నట్లే సీబీఐ విచారణ జరపాలి లేకుంటే ప్రతిపక్షాలతో చేతులు కలిపి కుట్ర చేస్తున్నట్లే అని సజ్జల కొత్త సిద్దాంతం చెపుతున్నారనుకోవచ్చు.

వివేకా హత్య కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు విచారిస్తుండగానే అవినాష్ రెడ్డికి సజ్జల, కెఏపాల్, వర్మ, విమలారెడ్డి తదితరులు క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈవిదంగా ఎవరికి వారు నచ్చిన్నట్లు తీర్పులు చెప్పుకొని క్లీన్ చిట్ ఇచ్చుకొనే వెసులుబాటు ఉంటే ఇక ఈ సీబీఐ, హైకోర్టు, సుప్రీంకోర్టుల అవసరం ఏమిటి? వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేయకుండా కాపాడుతున్న ఆ అదృశ్యశక్తి ఎవరు?అనే ప్రశ్నకు సీబీఐ సమాధానం చెప్పిందనే భావించవచ్చు.

sajjala-ramakrishna-reddy-ys-jagan-ys-vivekananda-reddy-murder