Sajjala-Ramakrishna-Reddy-Yadiki-Schoolఅనంతపురం జిల్లాలో యాడికి మండలంలోని ప్రాధమిక పాఠశాలలో 3,4,5 తరగతులకు చెందిన 124 మంది విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో, తరగతి గదులు లేనందున మూడు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో మూడు దిక్కులలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు చెపుతున్నారు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడిగా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించారు.

సజ్జల మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రజ్యోతి పేర్కొన్న ఆ ఉన్నత పాఠశాలలో 35 గదులు, అదనంగా మరో 14 గదులు ఉన్నాయి. ఆ పాఠశాలలో మొత్తం 754 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. మూడు, నాలుగు, ఐదో తరగతులలో మొత్తం 124 మంది ఉన్నారు. వారందరినీ స్టడీ అవర్స్ కోసం స్టడీ హాల్లో కూర్చోబెట్టి చదివిస్తుంటే ఫోటో తీసి తరగతి గదులు లేకపోవడంతో అలా చదివిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ తప్పుడు వార్తను ప్రచురించి మా ప్రభుత్వంపై బురదజల్లుతోంది,” అని చెప్పారు.

అయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో స్టడీ అవర్స్ కోసం ప్రత్యేకంగా స్టడీ హాల్స్ ఉండవు. సాధారణంగా 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ముందు స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. దానిలో భాగంగా వారిని ఓ గదిలో కూర్చోబెట్టి పాఠ్య పుస్తకాలను చదువుకొనేలా చేస్తారు. వారు చదువుకొంటున్నప్పుడు ఏవైనా డౌట్స్ వస్తే ఉపాధ్యాయులు వాటిని తీర్చుతుంటారు తప్ప పాఠాలు చెప్పరు.

కానీ ఈ ఫోటోలో 3,4,5 తరగతుల విద్యార్థులను మూడు దిక్కులలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు చెపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గుడ్డిగా సమర్ధించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

పాఠశాలలు విలీనం చేయాలనుకొన్నప్పుడు ముందుగా అదనంగా వచ్చే విద్యార్థుల కోసం తరగతి గదులు, టాయిలెట్లు, విద్యార్థులందరూ ఒకేసారి భోజనాలు చేసేందుకు హాల్ నిర్మించి, వారికి మంచి నీటి సౌకర్యం, మధ్యాహ్న భోజనం తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ అవేమీ చేయకుండా హడావుడిగా పాఠశాలలు విలీనం చేసేసి, విద్యార్థులను, ఉపాధ్యాయులను ఈవిదంగా ఇబ్బందులు పెట్టడం సరికాదని మీడియా సూచించింది. ఇటువంటి సమస్యలను తమ దృష్టికి తెచ్చినందుకు మీడియాను అభినందించకపోగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురుదాడి చేసి మీడియా నోరు మూయించాలని ప్రయత్నించడం ఇంకా దారుణం.