Sajjala-Ramakrishna-Reddy on chalo vijayawadaకొత్త పీఆర్సీ రద్దు చేసే వరకు చర్చలకు వెళ్ళేది లేదన్న ఉద్యోగ సంఘాలు, సోమవారం జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో “ఛలో విజయవాడ” కార్యక్రమాన్ని యధావిధిగా అమలు చేస్తామంటున్నారు. మరో వైపు చర్చలు రాకపోతే సమస్యలు తీరవు, కొత్త పీఆర్సీని రద్దు చేసే ఆలోచన లేదని, ‘ఛలో విజయవాడ’ నినాదాన్ని విరమించుకోవాలని ప్రభుత్వం చెప్తోంది.

ఈ అంశంపై సకల శాఖా మంత్రిగా పిలవబడే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల స్పందించారు. ‘ఛలో విజయవాడ’ను ఆపాలని, ఒకవేళ ఇది కొనసాగించాలనుకుంటే నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రస్తుతం ఉన్న దూరం ఇంకా పెరుగుతుంది గనుక, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా విరమించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంలో ఎవరు పాల్గొనవద్దని చెప్పిన సజ్జల, పరిస్థితులు అదుపు తప్పుతాయన్న సంకేతాలను ముందుగానే వ్యక్తం చేయడం విశేషం. ఉద్యోగులు చేసే ఉద్యమం వలన ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే, దానిని నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటే, అసలు ఇష్యూ డైవర్ట్ అవుతుందని అన్నారు.

ఇలా అయితే పరిస్థితులు మరింత జఠిలం అవుతాయని, అప్పుడు సమస్యల పరిష్కారం కంటే నష్టం ఎక్కువ అవుతుందని, అలాంటి దానిలో మీరు పాల్గొనవద్దని ఉద్యోగులను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఉద్యోగులు ససేమీరా అంటున్నారని, కానీ తాము మాత్రం అలా అనడం లేదని చర్చలకు సిద్ధమని, సవరణలకు తాము ఓపెన్ గా ఉన్నామని అన్నారు.

ఇది నిరంతర ప్రక్రియ అన్న సజ్జల, కొత్త పీఆర్సీని వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదు, అవసరమైతే అందులో సవరణలు చేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఉద్యోగ సంఘాలు చర్చలు జరపడానికి ఇంతకంటే మంచి ప్లాట్ ఫామ్ మరొకటి ఉండదని, ఈ కమిటీలో మంత్రులు ఉన్నారని, సీఎస్ ఉన్నారని, 20 రోజులైనా, 30 రోజులైనా ఉద్యోగులు ఇక్కడికి రావాల్సిందేనని స్పష్టం చేసారు.

పెరిగిన జీతాలు కనపడతాయి కాబట్టే జీతాలు వేయొద్దని చెప్తున్నారని, పెరిగిన మొత్తం పే స్లిప్స్ లో కనపడుతోందని, పెరిగిన జీతం ఎందుకు వద్దనుకుంటున్నారో అర్ధం కావడం లేదని సజ్జల అన్నారు. అయితే ఇవే పే స్లిప్ లను మాకు అవసరం లేదంటూ ఉద్యోగులు తగలబెట్టి నిరసన తెలియజేసారు. ఉద్యమ కార్యాచరణ పేరుతో రోడ్డు ఎక్కడం సబబు కాదని హెచ్చరించారు.

మేము వద్దన్నా జీతాలు వేసి సమ్మె మరో నెల రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగించడానికి సహకరించినందుకు ఉద్యోగ సంఘ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎంత నిర్బంధించినా, ఉద్యోగుల హక్కుగా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరని, ఒకవేళ అదే జరిగితే మరింత తీవ్రతరం అవుతుందని అన్నారు.

తప్పుడు పే స్లిప్ లు చూపించడం ద్వారా ఉద్యోగులలో ఆగ్రహం తగ్గుతుందేమోనని భావిస్తున్నారు, కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవని, మీ తప్పుడు కాకి లెక్కలు కట్టపెట్టి, రోడ్డున వెళ్లే ఎలిమెంటరీ కుర్రాడు అర్ధమైన విషయం ఈ ప్రభుత్వ పెద్దలకు అర్ధం కావడం లేదా? అంటూ మేధావులు నవ్విపోతున్నారని హేళన చేసారు.

జీతాలు పెంచినా ఆందోళన చేస్తున్నామని ప్రభుత్వం చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. చూడబోతుంటే “ఛలో విజయవాడ” కార్యక్రమం ఉద్రిక్తం కాబోతున్న సంకేతాలు ఇటు ప్రభుత్వం నుండి, ఇటు ఉద్యోగుల నుండి వ్యక్తం అవుతోంది. ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితులు ప్రస్తుతం కనపడడం లేదు. దీంతో 3వ తారీఖు జరగబోయే “ఛలో విజయవాడ” వైపే రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.