Sajjala-Ramakrishna-Reddy-Pawan-Kalyanజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారానికో నెలకో ఓసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి వెళ్ళిపోతున్నప్పటికీ రాష్ట్రంలో వైసీపీ నేతలు ఆయన వెంటపడటం మానడంలేదు. పవన్‌ కళ్యాణ్‌ ఆదివారం పల్నాడు జిల్లాలో పర్యటించినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి, వచ్చే ఎన్నికలలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు.

ఊహించినట్లే ఆయన వ్యాఖ్యలు, విమర్శలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని అడ్డుకోవడం ఎవరి తరంకాదు. ప్రతిపక్ష నేతలు రాజకీయ అజ్ఞానంతోనే ఆవిదంగా మాట్లాడుతున్నారు. నిజానికి పవన్‌ కళ్యాణ్‌ సీరియస్ రాజకీయ నాయకుడు కారు. ఆయన చంద్రబాబు నాయుడు ఏజెంటులా మాట్లాడుతున్నారు. ఆయన ఆలోచన అంతా చంద్రబాబు నాయుడుని ఏవిదంగా ముఖ్యమంత్రిని చేద్దామనే. అందుకే వచ్చే ఎన్నికలలో తమ పార్టీ 175 సీట్లకి పోటీ చేస్తుందని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడం నిజం కాకపోతే వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ రాష్ట్రంలో ఎన్ని సీట్లకి పోటీ చేస్తుందో ప్రకటించాలని సవాల్ చేస్తున్నాను,” అని అన్నారు.

వైసీపీకి తిరుగేలేదంటూనే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో అని వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌ని పదేపదే అడుగుతుండటం వారిలో అభద్రతాభావానికి అద్దంపడుతోందని చెప్పవచ్చు. జనసేన తమకి పోటీయే కాదని వైసీపీ నిజంగా భావిస్తున్నట్లయితే జనసేనను, పవన్‌ కళ్యాణ్‌ని అసలు పట్టించుకొని ఉండేవారేకారని చెప్పవచ్చు. కానీ పవన్‌ కళ్యాణ్‌ని పదేపదే టిడిపితో పొత్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తునారంటే దీనికి మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఇటువంటి సవాళ్ళతో పవన్‌ కళ్యాణ్‌ని రెచ్చగొట్టి సీట్ల సర్దుబాట్ల విషయంలో టిడిపి, జనసేనల మద్య విభేధాలు సృష్టించడం.

2. కాపు సామాజిక వర్గంలో పవన్‌ కళ్యాణ్‌ విశ్వసనీయత పట్ల అనుమానాలు రేకెత్తించి ఆ వర్గాన్ని జనసేన వైపు మొగ్గుచూపకుండా అడ్డుకోవడం.

3. పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తులు పెట్టుకోబోతున్నారంటూ పదేపదే చెపుతుండటం ద్వారా బిజెపిని ఆయనకి దూరం చేసి దాంతో వైసీపీ దోస్తీ చేయాలనుకోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి.

అయితే పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మరింత రాజకీయ పరిపక్వతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కులసమీకరణల గురించి మాట్లాడుతుండటం, వైసీపీ ఎంతగా రెచ్చగొడుతున్నా దాని ఉచ్చులో చిక్కుకోకుండా దాని విమర్శలు తిప్పికొడుతుండటమే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే టిడిపి, జనసేనలని దెబ్బతీయడానికి వైసీపీ ప్రయత్నాలు వైసీపీ చేస్తూనే ఉంటుంది. కనుక పొత్తుల అంశంపై ఈ ఎన్నికల వరకు ఈ వాదోపవాదాలు కొనసాగుతూనే ఉండవచ్చు.