Sajjala_Ramakrishna_Reddy_Pwan_Kalyanఏపీ ప్రభుత్వంలో అన్ని శాఖల గురించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడుతుండటాన్ని ఉద్దేశ్యించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆయనకి ‘సకల శాఖా మంత్రి’ అనే బిరుదు ఇచ్చారు.

దీనిపై సజ్జల స్పందిస్తూ, “పవన్‌ కళ్యాణ్‌ నన్ను ఎద్దేవా చేస్తూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అయన ఎప్పుడు మీడియా, ప్రజల ముందుకు వచ్చినా చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటారు తప్ప సొంతంగా ఒక్క ముక్క మాట్లాడలేరు. పొత్తుల విషయంలో ఆయన మూడే ఆప్షన్స్ చెప్పారు. నాలుగో ఆప్షన్‌గా బేషరతుగా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తానని కూడా చెప్పి ఉంటే బాగుండేది.

గత రెండు ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది. ఈసారి కూడా ఆయన చేతిలోనే ఉంది. కాదంటే జనసేన పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందని చెప్పి ఉండేవారు. కనీసం టిడిపి, జనసేనలు సగం సగం సీట్లలో పోటీ చేస్తాయని చెప్పగలరా?

ఆయన, చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినా పర్వాలేదు. విడివిడిగా వచ్చినా పర్వాలేదు. సిఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీని ఎదుర్కోవడం వారి వలన కాదు. పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ యాత్రలని అడ్డుకోవలసిన ఖర్మ మా ప్రభుత్వానికి లేదు. అసలు నారా లోకేష్‌ పాదయాత్ర గురించి టిడిపి చాలా ఎక్కువగా ఊహించుకొంటోంది. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా, వాహనాలు వేసుకొని వచ్చినా వైసీపీని సిఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు,” అని అన్నారు.

టిడిపి, జనసేనలు కలిసి వచ్చినా… వేర్వేరుగా వచ్చినా పర్వాలేదు 175 సీట్లు మాకేనని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొంటున్నప్పుడు, ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొంటాయో లేదో అని ఆలోచించడం, కనీసం సగం సీట్లలోనైనా పోటీ చేస్తామని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాలని కోరుతుండటం గమనిస్తే ఈవిదంగానైనా ఆ రెండు పార్టీల మద్య విభేదాలు ఏర్పడి దూరం అవ్వాలని కోరుకొంటున్నట్లు అర్దం అవుతోంది. అసలు ఆ రెండు పార్టీలు కలవకూడదని వైసీపీ ఎందుకు కోరుకొంటోంది?అనే సందేహం కలుగుతుంది. కలిస్తే వైసీపీ ఓడిపోయే ప్రమాదం ఉంటుందనే భయం వల్లనే అని అర్దం అవుతోంది.

అందుకే పవన్‌ కళ్యాణ్‌ని ఇటువంటి మాటలతో రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ వారి ఉచ్చులో చిక్కుకోకుండా టిడిపితో పొత్తులకి సిద్దపడుతుండటం వైసీపీలో అందరికీ ఆందోళన కలిగిస్తోందని చెప్పవచ్చు.