వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడటంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
ఈ వ్యవహారంపై నిన్న సిఎం జగన్మోహన్ రెడ్డితో చర్చించిన తరువాత అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. అది మార్ఫింగ్ వీడియో అని, దానితో తనకు ఎటువంటి సంబందమూ లేదని ఆయన అంటున్నారు. పైగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కనుక దర్యాప్తులో అసలు విషయం తెలియాల్సి ఉంది.
ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే ఆయనపై పార్టీ పరంగా కటినాతి కటినమైన చర్యలు తీసుకొంటాము. సభ్య సమాజంలో ఇటువంటి వాటికి తావులేదు. మహిళలను ఎంతో గౌరవించే వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఆయన ఇటువంటిని అసలు క్షమించరు. ఒకవేళ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు చేసినట్లు తేలితే మళ్ళీ మరొకరు అటువంటి తప్పు చేయకుండా ఉండేంత కటినంగా చర్యలు తీసుకొంటారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ చెప్పలేను.ఎందుకంటే ఇది అతనికి సంబందించిన ప్రైవేట్ వ్యవహారం. ఇంకా పోలీసులు దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది,” అని చెప్పారు.
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడూ వైసీపీ ఇదేవిదంగా వ్యవహరించింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తే గానీ అతనిని అరెస్ట్ చేయలేదు. తరువాత పార్టీలో నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది కానీ నేటికీ అతను వైసీపీ ఎమ్మెల్సీగానే పరిగణింపబడుతున్నాడు.
ఇప్పుడు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలోనూ అలాగే జరుగుతోంది. ప్రతిపక్షాలు, మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తరువాత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు చేసినట్లు తేలితే ‘పార్టీ పరంగా’ చర్యలు తీసుకొంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం గమనిస్తే, అతనిని పార్టీలో నుంచి సస్పెండ్ చేసి ఎంపీగా వాడుకొంటుందని అర్దమవుతోంది. అతను పార్టీకి, ప్రభుత్వానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతిధ్యం వహిస్తున్నప్పుడు ప్రైవేట్ వ్యవహారం ఎలా అవుతుంది?