Sajjala Ramakrishna Reddy govt employees new prcప్రభుత్వం ఎప్పుడు అప్పాయింట్మెంట్ ఇస్తోందా, తమ గోడు చెప్పుకుందామని నిరీక్షిస్తుంటారు. కానీ ప్రస్తుత జగన్ సర్కార్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉద్యోగ సంఘాల నేతలు ఎప్పుడు వస్తారో, చర్చలు జరుపుదాం అని నిరీక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే తంతు జరుగుతుండగా, తాజాగా ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఉద్యోగుల తీరును తప్పుబట్టారు.

హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించడం లేదని, హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరిగిందని భావిస్తే తాము చర్చలకు సిద్ధమని, ఒకవేళ ఉద్యోగులు చర్చలకు వచ్చియుంటే పాత విధానంలో జీతాలు ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించేదని అన్నారు. ఫిట్ మెంట్ నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు తొలుత చెప్పాయని, ఇప్పుడు ‘మాట మార్చి’ మరోలా వ్యవహరించడం సబబు కాదని అన్నారు.

కొత్త పీఆర్సీ రద్దు ప్రకటనే తర్వాతే ఎలాంటి చర్చలైనా అని ఉద్యోగ సంఘాలు మరోవైపు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ అంశం పక్కదారి పట్టించడానికి కొత్త జిల్లాల వంటి ప్రకటనలు ప్రభుత్వం ఎన్ని చేసినా, వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకటించిన రోజు ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేసారు గానీ, కొత్త జీతాలు అందుకున్న నాటి నుండి ఉద్యోగ సంఘాలు ఇదే స్టాండ్ పైన ఉన్నాయి.

‘సకల శాఖా మంత్రి’గా రఘురామకృష్ణంరాజు పిలుచుకునే సజ్జలే ఉద్యోగుల విషయంలో మాట మార్చిన వైనం వారి ఆగ్రహానికి గురయ్యింది. సీపీఎస్ రద్దు విషయంలో ‘అవగాహన లేకుండా జగన్ గారు అప్పుడేదో హామీ ఇచ్చారు గానీ, అది అమలుకు సాధ్యం కాదంటూ’ చాలా తేలికగా ‘మాట మార్చిన’ వైనం తెలియనిది కాదు. అలాగే ‘ఫిట్ మెంట్’ విషయంలో కూడా… ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చేవరకు వెళ్లిందంటే, ప్రభుత్వం మార్చిన మాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.

ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించి ‘మాటలు మార్చిన’ వైనం మాత్రమే. ఇక జగన్ సర్కార్ మూడేళ్ళ పాలనను అభివర్ణించాలంటే ఆయన ఉపయోగించిన ‘స్లోగన్’నే వినియోగించాల్సి ఉంటుంది. అవ్వాతాతల పెన్షన్ మొదలుకుని రాజధాని వరకు ప్రతి అంశంలోనూ ‘మాట తప్పుడే – మడమ తిప్పుడే’ అన్న స్లోగన్ ను పుణికి పుచ్చుకున్నట్లుగా చేస్తోన్న పాలన ప్రజల చేత ‘నభూతో నభవిష్యతి’ అనిపించుకుంటోంది.