Sajjala-Rama-Krishna-Reddy-Andhra-Pradeshసజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ ప్రభుత్వం మీడియా సలహాదారుగా పెట్టుకొన్నందుకు ప్రతిపక్షాలు సిఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలి. ఎందుకంటే, ఆయన వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అనాలోచిత నిర్ణయాలను సమర్ధించుకొనేందుకు చిత్రవిచిత్రమైన వాదనలు చేస్తూ ప్రజలలో ప్రభుత్వంపై మరింత అపనమ్మకం కలిగేలా చేస్తున్నారు కనుక. అంటే ఆయన జగన్‌ ప్రభుత్వానికి శల్య సారధ్యం చేస్తున్నారనుకోవచ్చు.

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలు ఆలస్యం అవుతుండటంపై ఆయన స్పందిస్తూ, “గతంలో ప్రభుత్వం అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి సకాలంలో చెల్లింపులు చేసేది కాదు. కనుకనే సకాలంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి జీతాలు చెల్లించగలుగుతుండేది. కానీ మా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా జీతాలు చెల్లించాలని ప్రయత్నిస్తుండటం వలన కాస్త ఆలస్యం అవుతోంది. అందరికీ ఒకేసారి జీతాలు ఇవ్వాలనుకోవడం తప్పు కాదు కదా?అయినా జీతాలు కోసుకొని ఇవ్వడం కంటే కాస్త ఆలస్యంగా ఇవ్వడమే మంచిది కదా?” అని అన్నారు.

ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం వలననే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి 14-15 తేదీల వరకు జీతాలు చెల్లించలేకపోతోందనే విషయం అందరికీ తెలుసు. కానీ అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వాలనే గొప్ప ఆలోచనతో జీతాలు చెల్లింపు ఆలస్యం అవుతోందని సజ్జల వారు సెలవిస్తున్నారు. అయితే కాస్త ఆలస్యమైనా అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా నెలనెలా జీతాలు చెల్లిస్తోందా?అనే ప్రశ్నకి ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకే చెల్లించలేకపోతున్న ప్రభుత్వం అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి మాత్రం టంచనుగా నెలనెలా చెల్లిస్తోందని చెపుతారేమో?

ముందస్తు ఎన్నికల గురించి మీడియాలో వస్తున్న వార్తాపై స్పందిస్తూ, “ముందస్తు ఎన్నికల గురించి చంద్రబాబు నాయుడే ఆతృత పడుతున్నారు తప్ప మేం కాదు. నానాటికీ మా ప్రభుత్వానికి ప్రజాధారణ పెరుగుతుండటం చూసి ఢీలా పడుతున్న టిడిపి శ్రేణులని ఉత్సాహపరచడానికి ఆయన ముందస్తు వస్తుందని నమ్మబలుకుతున్నారు. మమ్మల్ని 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు ఎన్నుకొన్నప్పుడు ముందస్తుకు ఎందుకు వెళతాము? మాకు ఇంత ప్రజాధారణ ఉన్నందున 5 ఏళ్ళు ముగిసిన తర్వాతే ఎన్నికలకి వెళతాము. అంతవరకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఎదురుచూడక తప్పదు,” అని అన్నారు.

ఈ మూడున్నరేళ్ళ వైసీపీ పాలనకే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయున్నారు. కనుక వైసీపీ మరో ఏడాదిన్నర పాలన చేయాలనుకొంటే ఆలోగా వైసీపీ అనాలోచిత నిర్ణయాలు, అసమర్దత, అవినీతి, వైఫల్యాలు మరిన్ని బయటపడతాయి. మొదట్లో 4,5, 7 తేదీలలోగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి ప్రభుత్వం జీతాలు చెల్లించేది. కానీ ఇప్పుడు అది 12,14,15 తేదీలకి చేరింది. మరో ఏడాదికి అది 25కి చేరినా ఆశ్చర్యం లేదు. ఇక జీతాలే చెల్లించలేకపోతున్నప్పుడు రాబోయే రోజుల్లో సంక్షేమ పధకాలకి కోత విధించే అవకాశం ఉండవచ్చు. కనుక అప్పటికి ప్రజావ్యతిరేకత ఇంకా పెరిగిపోతుందే తప్ప తగ్గదు. కనుక సజ్జల చెప్పినట్లు వైసీపీ ప్రభుత్వం పూర్తికాలం పనిచేస్తేనే ప్రతిపక్షాలకు మరింత మేలు కలుగుతుంది. కనుక తమ ప్రభుత్వం పూర్తికాలం పనిచేస్తుందని చెపుతున్నందుకు ప్రతిపక్షాలు సజ్జలకి రుణపడాలి. తప్పదు!