‘జగనన్నే మా భవిష్యత్’ అని వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుకొంటే తప్పులేదు. మంత్రి విడదల రజని ఈరోజు చిలకలూరిపేట సభలో కన్నీళ్ళు పెట్టుకొని అదే ముక్క చెప్పారు కూడా. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ‘జగనన్నే మా భవిష్యత్’ అని చెప్పుకోవాలని ఒత్తిడి చేయడం అంటే మెడ మీద కత్తి పెట్టి అభిప్రాయం చెప్పమన్నట్లే! కాదని చెపితే ఎటువంటి ఇబ్బందులు మొదలవుతాయో అందరికీ తెలుసు కనుక వైసీపీ ఏమి చెప్పమంటే అదే చెపుతారు. దీంతో జగనన్నకు, ఆయనకు ఈవిదంగా శల్యసారధ్యం చేస్తున్నవారికి తృప్తి కలుగవచ్చేమో కానీ వీటితో ఓట్లు రాలవు. తమకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్పించుకోవడం అంటే తమను తామే మోసగించుకొంటున్నట్లు చెప్పవచ్చు. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మనవే అని తమని తామే మభ్యపెట్టుకొంటున్నట్లు, ఇదీ అటువంటిదే అని చెప్పవచ్చు.
ఈ భ్రమలో ఉండటమే వైసీపీకి సంతోషం కలిగిస్తుందంటే ప్రజలు మాత్రం ఎందుకు కాదంటారు? వీలైతే ఇదే అదునుగా అందరూ తమ సమస్యలు, కోరికల చిట్టా విప్పి వీలైనంతవరకు సాధించుకొనేందుకు ప్రయత్నిస్తారు కూడా. ఇది అనుభవపూర్వకంగా వైసీపీ నేతలే త్వరలో తెలుసుకొంటారు.
ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ “సాహసోపేతమైన కార్యక్రమం” అమలుచేయబోతున్నట్లు వైసీపీ ప్రభుత్వానికి శల్యసారధ్యం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏడు లక్షల గృహసారధులు కోటి 60 లక్షల కుటుంబాలను కలిసి గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి పనితీరులో తేడా వివరిస్తారని చెప్పారు. జగనన్నే మా భవిష్యత్ అని నమ్మేవారు తమ ఇళ్లకు జగనన్న ఫోటో స్టిక్కర్ అంటించుకోవచ్చని, మొబైల్ ఫోన్ వెనుక కూడా స్టికర్స్ అంటించుకోవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తన ప్రభుత్వం వలన మేలు/లబ్ది పొందితేనే తనకు మళ్ళీ ఓట్లేయమని ప్రజలను కోరడం ద్వారా ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడు చేయని సాహసం జగనన్న చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అసలు ప్రతీ ఇంటికీ, ఫోన్‌కి స్టిక్కర్స్ అంటించి, ‘జగనన్నే మా భవిష్యత్’ అని చెప్పిస్తే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు సలహా చెప్పారో తెలీదు కానీ ఇటువంటి సలహాలతో తమ అధినేతను తప్పుదోవలో నడిపిస్తున్నట్లే చెప్పవచ్చు. ప్రజల ఆకాంక్షల ప్రకారం ప్రభుత్వం తనపని తాను చేసుకుపోతే ఇలా ప్రతీ ఇంటికి వెళ్ళి దేబీరించనవసరమే లేదు. దేబీరించినా ప్రజలు కనికరిస్తానే నమ్మకం లేదు కూడా.
ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇటువంటివన్నీ గాలికి కొట్టుకుపోతాయి. ఇటువంటి అనుకూల సర్వేలు ఎన్ని చేయించుకొన్నా, ఎంతగా ‘పోల్ మేనేజిమెంట్’ చేసినా చివరికి ప్రజాభిప్రాయమే వినిపిస్తుంది. కనుక ప్రజల మెడ మీద కత్తిపెట్టి నువ్వే మానాయకుడువని బలవంతంగా చెప్పించే ప్రయత్నాలు చేస్తే ఇది కూడా గడప గడపకి కార్యక్రమంలా బెడిసికొట్టడం ఖాయం అని వైసీపీ గ్రహిస్తే మంచిది.