Sajjala Ramakrishna Reddyఅవును… ఈ మాటలన్నది మరెవరో కాదు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి! గత ప్రభుత్వం నిర్ణయాలను సమీక్షించి దర్యాప్తు జరిపేందుకు తమ ప్రభుత్వానికి అధికారం ఉందని సుప్రీంకోర్టు నేడు స్పష్టం చేసింది కనుక చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను తవ్వితీస్తామని సజ్జల చెప్పారు.

ఈరోజు తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిట్‌ దర్యాప్తుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసింది కనుక అమరావతి భూములలో అక్రమాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ ఇంకా గత ప్రభుత్వం తీసుకొన్న అనేక నిర్ణయాలపై లోతుగా దర్యాప్తు జరిపిస్తాము. బహుశః వచ్చే ఎన్నికలలోగా అన్నిటిపై సిట్‌ దర్యాప్తు పూర్తయితే చంద్రబాబు నాయుడుని ఎన్నికలకు ముందు జైలుకి పంపిస్తాము. మేము మొదటే ఈ పని చేసి ఉంటే చంద్రబాబు నాయుడుని రాజకీయంగా అడ్డం తొలగించుకోవడానికే చేశామని ఆరోపించి ఉండేవారు. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి అంతా పద్దతి ప్రకారమే ముందుకు సాగుదామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నష్టం కలిగించిన ప్రతీ నిర్ణయాన్ని మంత్రుల సబ్ కమిటీలో లోతుగా చర్చించిన తర్వాత అవినీతి జరిగిందని నిర్ధారించుకొని శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి దానిపై మళ్ళీ అక్కడా లోతుగా చర్చించి, సభాపతి ఆమోదంతో సిట్‌ ఏర్పాటు చేశాము. దాంతో టిడిపి భయపడి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే అక్కడా దానికి ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ హయంలో తీసుకొన్న నిర్ణయాల వెనుక అవినీతిని సిట్‌ చేత తవ్వితీయించి చంద్రబాబు నాయుడుని జైలుకి పంపిస్తాము,” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

గత ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరోపిస్తోంది. తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ, తమ కనుసన్నలలోనే సిట్‌ దర్యాప్తు చేయిస్తున్నప్పటికీ, నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడుపై కానీ టిడిపి మంత్రులపై గానీ ఒక్క ఆరోపణను నిరూపించలేకపోయింది. కానీ సిట్‌ దర్యాప్తు పేరుతో నాటి నుంచి టిడిపి ముఖ్యనేతలందరినీ వేదిస్తూనే ఉంది. అంటే అవినీతి ఆరోపణలు ఉత్తుత్తివే అని అవి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే అని స్పష్టం అవుతోంది. కనుక ఇప్పుడూ సిట్‌ దర్యాప్తు పేరుతో టిడిపి నేతలను వేధించడం తప్ప మరేమీ చేయలేకపోవచ్చు.

“చంద్రబాబు నాయుడుని తన నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని” ఆనాడు తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా చాలా ప్రగల్భాలు పలికారు. కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోనే తన కళ్ళ ముందే ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. కేసీఆర్‌ అంతటివాడే చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేనప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు?

అయినా వివేకా హత్యకేసుతో ఉలికులికి పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి తన భయాన్ని దాచుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేందుకు ఈ మాత్రం ప్రగల్భాలు పలకడం సహజమే.