Sajjala-Rama-Krishna-Reddy-YSRCPఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి ఎంత దయనీయంగా ఉందో కొత్తగా చెప్పుకోనవసరం లేదు. విద్యుత్‌ ఛార్జీల పెంపు వల్ల కావచ్చు పవర్ హాలీడేస్ వల్ల కావచ్చు రాష్ట్రంలో గ్రానైట్, ఆక్వా వంటి కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక వైసీపీ నేతల వేదింపులతో జాకీతో సహా మరికొన్ని పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయి.

ఇక టిడిపి ఆర్ధికమూలాలు దెబ్బతీయడం ద్వారా రాష్ట్రంలో ఆ పార్టీని కనబడకుండా చేయాలనే దురాలోచనతో టిడిపి నేతలకి చెందిన కొన్ని కంపెనీలని మూసుకుపోయేలా చేశారు లేదా వాటికి పోటీగా గుజరాత్‌ నుంచి అమూల్ వంటి కంపెనీలను దింపారు. రాజధాని నిర్మాణపనులు నిలిపివేయడంతో రాష్ట్రానికి రావలసిన కొన్ని పరిశ్రమలు హైదరాబాద్‌ దారి పట్టగా, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను చూసి మరికొన్ని వెంకడుగువేశాయి.

ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం నిర్ణయాలను పక్కన పడేస్తామని వైసీపీ ప్రభుత్వం నిరూపించి చూపడంతో ఇటువంటి రాజకీయ అనిశ్చితస్థితి ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఎందుకని మరికొన్ని పరిశ్రమలు హైదరాబాద్‌కి తరలిపోతున్నాయి. ఈ అనిశ్చితి కారణంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది.

కనుక కర్ణుడు చావుకి వంద కారణాలన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా టిడిపి, జనసేనలు కుట్రలు పన్నుతున్నాయని, సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రమించి రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తెస్తుంటే ఆ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వితండవాదం చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది.

తమ ప్రభుత్వం పార్టీలకు, రాజకీయాలకు, ప్రాంతలకి అతీతంగా పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు ముందుకు వచ్చినా వారికి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి అన్ని విదాల తోడ్పడుతోందని సజ్జల అన్నారు. తమ ప్రభుత్వం అద్భుతమైన పారిశ్రామిక విధానం అమలుచేస్తున్నందునే ఆదానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తుంటే, అది చూసి కూడా ఓర్వలేని టిడిపి దాని అనుకూల మీడియా రాష్ట్రాన్ని ఆదానీకి దోచిపెట్టేస్తోందని విషప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావంటూ అవి దుష్ప్రచారం చేస్తూ ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పట్ల ఓ రకమైన అపనమ్మకం కలిగేలా చేసేందుకు పెద్ద కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. వాటి పత్రికలలో వచ్చిన ఇటువంటి వార్తలను బేస్ చేసుకొని మళ్ళీ ఆ పార్టీల నేతలు ఏదేదో మాట్లాడేస్తూ చివరికి వారే నవ్వులపాలవుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

అయితే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేకపోతున్న ప్రభుత్వం, ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయితీ ఆఫీసుల విద్యుత్‌ బకాయిలు చెల్లించలేకపోతున్న ప్రభుత్వం, ఆక్వా కంపెనీలకు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోందంటే నమ్మశఖ్యంగా ఉందా?

ఒకవేళ సజ్జల చెపుతున్నట్లు ఏపీలో ఇంత మంచి వాతావరణమే ఉండి ఉంటే అన్ని పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు హైదరాబాద్‌లోనే ఎందుకు ఏర్పాటవుతున్నాయి? రాష్ట్రంలో భారీగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నమాట నిజమైతే ఏపీలో ఇంజనీరింగ్ చేసిన ప్రతీ విద్యార్ధి హైదరాబాద్‌కో లేదా బెంగళూరుకో ఎందుకు వలసలు పోతున్నట్లు?అసలు రాష్ట్రంలో ఎన్ని ఐ‌టి కంపెనీలు ఉన్నాయో వాటిలో ఎన్ని లాభాలలో నడుస్తున్నాయో సజ్జల చెప్పగలరా?

తెలుగు సినీ పరిశ్రమని బెదిరించినా, ప్రోత్సాహకాలు ఇస్తామన్నా ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి ఎందుకు ఇష్టపడటం లేదు?రాయలసీమలో భారీగా టమోటో సాగవుతుంటే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేయాలి కానీ ప్రభుత్వం శీతల గోదాములు ఏర్పాటు చేస్తోందని గొప్పగా చెప్పుకొంది. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు, వాటి మీడియా కుట్రలే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పగలరా?