Sajjala Ramakrishna Reddy 10th Class Results issueఈ ఏడాది పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతిలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “గతంలో కొన్ని విద్యాసంస్థలలో మాల్‌ ప్రాక్టీస్ చాలా ఎక్కువగా జరిగేది. అందుకే అప్పుడు ఉత్తీర్ణత శాతం అంత ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి చాలా పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించి మాల్ ప్రాక్టీస్‌ని అడ్డుకోవడంతో ఉత్తీర్ణత శాతం కొంత తగ్గి ఉండవచ్చు. కనుక ఇప్పుడు ఉత్తీర్ణత శాతం తగ్గిందని విమర్శిస్తున్నవారు అప్పుడు అంత ఎక్కువ ఎలా వచ్చేదో చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశం పెట్టడం కొంత గందరగోళానికి దారి తీసింది. విద్యార్దులు ఇంగ్లీషు మీడియంలో అలవాటుపడేందుకు కొంత సమయం పడుతుంది కనుక ఈసారి అది కూడా పరీక్షా ఫలితాలపై కొంత ప్రభావం చూపి ఉండవచ్చు. అయితే దీర్గకాలంలో ఇంగ్లీషు మీడియం వలన తప్పక సత్ఫలితాలు వస్తాయి.

గత రెండేళ్ళుగా కరోనా కారణంగా తరగతులు నిర్వహించలేకపోవడంతో విద్యార్దులు చదువులలో వెనకబడిపోయారు. అయినప్పటికీ వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పరీక్షలు రాయకుండానే పదో తరగతికి ప్రమోట్ చేసింది. పది ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి బహుశః ఇదీ ఓ కారణమై ఉండవచ్చు.

అయితే ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్దులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాము. పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల పట్ల విద్యార్దులు, తల్లితండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు,” అని చెప్పారు.

ఒకవేళ ఈసారి పదో తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండి ఉంటే అప్పుడు వైసీపీ నేతలు ఇదంతా తమ గొప్పదనమే అంటూ జబ్బలు చరుచుకొనేవారు. కానీ ఉత్తీర్ణత శాతం తగ్గడంతో మాల్‌ ప్రాక్టీస్‌ని అడ్డుకోవడం వలన తగ్గిందని సజ్జల చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఒకవేళ త్వరలో జరుగబోయే సప్లిమెంటరీ పరీక్షలలో, వచ్చే ఏడాది జరుగబోయే పదో తరగతి పరీక్షలలో 90 శాతం ఉత్తీర్ణత వస్తే అప్పుడు మాల్ ప్రాక్టీస్ జరిగిందనుకోవాలా? అయినా ఉత్తీర్ణత శాతం తగ్గితే ఎవరైనా ప్రశ్నిస్తారు కానీ గతంలో ఎందుకు పెరిగిందో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలను సంజాయిషీ కోరడం చాలా విడ్డూరంగా ఉంది.

ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం అనాలోచిత నిర్ణయమే అని సజ్జల అంగీకరించినట్లు అర్దమవుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టే ముందు ముందుగా అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ముందుగా ప్రాధమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే విద్యార్దులు పదో తరగతికి వచ్చేసరికి ఇంగ్లీషు భాషపై పూర్తి పట్టు ఏర్పడుతుంది. అంతకంటే ముందు ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ భోదనలో సుదీర్గ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీలైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొన్న ఉపాధ్యాయులను నియమించుకోవలసి ఉంటుంది. ఇంగ్లీషులో పాఠ్యాంశాలు విద్యార్దులకు చక్కగా అర్దమయ్యేలా భోధిస్తూ వారికి అవగాహన ఏర్పడిందా లేదా అని తరచూ పరిశీలిస్తుండాలి. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉంటాయని విద్యావేత్తలు, ఉపాధ్యాయులకు తెలుసు.

కానీ వైసీపీ ప్రభుత్వం గొప్ప కోసం హడావుడిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం పదో తరగతి పరీక్షలు బెడిసికొట్టడానికి ఓ కారణం అని చెప్పక తప్పదు.