Sajjala-Rama-Krishna-Reddy-YSRCPఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈరోజు క్లీన్ చిట్ ఇవ్వగా, వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు.

తమ ఎంపీలు స్వాతిముత్యాలని, రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే సీబీఐ అక్రమంగా తమ ఎంపీలపై తప్పుడు కేసులు నమోదు చేసిందని బాలినేని, సజ్జల వాదించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తుండగా, సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “వివేకా హత్యతో అవినాష్ రెడ్డికి సంబందం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎన్నికల సమయంలో మా అధినేత జగన్మోహన్ రెడ్డిని నైతికంగా దెబ్బ తీసేందుకే టిడిపి ఈ దుష్ప్రచారం చేసింది. ఈ హత్యతో టిడిపి నాయకులు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలకి సంబందం ఉందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించలేదు. కనీసం వారి ఫోన్‌ కాల్ రికార్డులను పరిశీలించకుండానే అవినాష్ రెడ్డిని నేరస్థుడిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. వివేకా హత్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. కనుక ఈ హత్యకి స్క్రీన్-ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే అని భావిస్తున్నాము,” అని అన్నారు.

“వివేకానందరెడ్డి చనిపోవడం వలన మా పార్టీకి, సిఎం జగన్‌ కుటుంబానికే నష్టం జరిగింది. ఆయన తిరిగి వైసీపీలోకి వస్తానంటే పార్టీలో చేర్చుకొనేందుకు సిఎం జగన్‌ సిద్దపడ్డారు కూడా. వివేకకి గుండెపోటు వచ్చి చనిపోయారని ఆయన బావమరిది, మా పార్టీకి అత్యంత ఆప్తుడు శివశంకర్ రెడ్డి ఫోన్‌ చేసి చెపితేనే అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్లారు తప్ప ఈ హత్యతో ఆయనకి ఎటువంటి సంబందమూ లేదు. వివేక హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగడం లేదని మేను భావిస్తున్నాము,” అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

వివేకా హత్య కేసు గురించి ఇన్ని విషయాలు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసి ఉన్నప్పుడు, సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరుపడం లేదని భావిస్తున్నప్పుడు సీబీఐ కోర్టు లేదా హైకోర్టులోనో పిటిషన్‌ వేయవచ్చు కదా? కానీ వివేకా మా కుటుంబ సభ్యుడు కనుక ఆయనని మేమేందుకు చంపుకొంటామన్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వాదనలు కోర్టులో నిలువవు కనుకనే ఈవిదంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడుతున్నట్లు భావించవచ్చు.

అయినా వివేక గుండెపోటు వచ్చి చనిపోయారని శివశంకర్ రెడ్డే ఫోన్‌ చేసి చెప్పారని సజ్జలే ఇప్పుడు చెప్పుకొన్నారు కదా? ఆయన హత్యకి గురైతే గుండెపోటు వచ్చిందని చెప్పారంటే అర్దం ఏమిటి? నిందితులు ఎవరు?

ఏపీలో జగనన్న రాజ్యంలో తన తండ్రి హత్య కేసుపై నిష్పక్షపాతంగా జరగడం లేదనే కదా ఆయన కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి హైదరాబాద్‌కి బదిలీ చేయించుకొన్నారు?అప్పటి నుంచే ఈ కేసు విచారణ వేగవంతమయ్యింది. ఇప్పుడు కీలక దశకి చేరుకొనేసరికి వైసీపీ నేతలు సీబీఐని నిందిస్తుండటం ద్వారా వారే సీబీఐపై ఒత్తిడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్లు కాదా?

చివరిగా ఒక్క ప్రశ్న… సీబీఐని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేయగలిగితే ఇంతకాలం ఈ కేసు విచారణ కొనసాగి ఉండేదా?ఏనాడో నిందితులు జైలుకి వెళ్ళిపోయేవారే కదా?