Sajjala-Rama-Krishna-Reddy-Andhra-Pradeshఏపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న వ్యక్తులలో ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆయన ఈరోజు సంచలన వ్యఖ్యలు చేశారు.

మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ చాలా కాలం క్రితం ఓ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనని మొదటి నుంచి ఒక్క వైసీపీ మాత్రమే గట్టిగా వ్యతిరేకిస్తూ పోరాడిందని అన్నారు.

ఉండవల్లి చేసిన ఈ వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, “అవును. మా పార్టీ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైసీపీ అనేక పోరాటాలు కూడా చేసింది. రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ మా పార్టీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా పిటిషన్లు వేసి న్యాయపోరాటం చేస్తోంది. కుదిరితే రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఏకం అవ్వాలనే మేము కోరుకొంటున్నాము. ఒకవేళ సుప్రీంకోర్టు రెండు తెలుగు రాష్ట్రాలను మళ్ళీ కలపాలని ఆదేశిస్తే మొదట స్వాగతించేది మా పార్టీయే. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే మా పార్టీ విధానం,” అని అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 8 ఏళ్ళు పైనే అయ్యింది. రెండు రాష్ట్రాలలో రెండుసార్లు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దేనికి దానికి అన్ని వ్యవస్థలని మళ్ళీ ఏర్పాటుచేసుకొని స్వతంత్రంగా కొనసాగుతున్నాయి. ఏపీ ప్రజలు మొదట భావోద్వేగంతో రాష్ట్ర విభజనని వ్యతిరేకించినప్పటికీ మానసికంగా ప్రస్తుత ఏపీని అంగీకరిస్తున్నారు కూడా. ఇటువంటి పరిస్థితులలో సజ్జల ఈవిదంగా మాట్లాడటం రాజకీయమనే భావించవచ్చు.

ఒకప్పుడు రెండు పార్టీలు కత్తులు దూసుకొంటే వాటిని శత్రువులుగా భావించేవారు. కానీ ఇప్పుడు పరస్పరం సహకరించుకోవడానికి కూడా కత్తులు దూసుకొంటున్నట్లు నటించడం కొత్త ట్రెండ్. ఉదాహరణకి హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత రాసుకుపూసుకు తిరుగుతున్న టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు ఆ ఎన్నికల సమయంలో పరస్పరం కత్తులు దూసుకొని ఎవరి ఓట్లు అవి రాబట్టుకొన్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, అధికార టిఆర్ఎస్‌, వైసీపీ నేతల మద్య బలమైన స్నేహసంబంధాలే ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని శత్రువులుగా మార్చుకొని తిప్పలు పడుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌కి బలమైన ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రాన్ని అందించి ఆదుకోవడానికే సజ్జల రామకృష్ణారెడ్డి ఈవిదంగా మాట్లాడినట్లు భావించవచ్చు.

తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రని సమైక్యవాదుల కుట్ర, దాడిగా టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సజ్జల వారికి సహాయపడేందుకు మరో అస్త్రం అందించినట్లు భావించవచ్చు.

అయినా మూడు రాజధానుల పేరుతో ఏపీలో మూడు ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు రగిలిస్తూ, ఎప్పుడో 8 ఏళ్ల క్రితం విడిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఏపీలో కలుపుకోవాలనడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?