Sajjala-Rama-Krishna-Reddy-AndhraPradeshతెలంగాణ సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన బిఆర్ఎస్‌గా మారిన టిఆర్ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించడానికిగాను కేసీఆర్‌ క్యాబినెట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ త్వరలో ఏపీకి రాబోతున్నారని, విజయవాడ లేదా విశాఖపట్నంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

వాటిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, “దేశంలో ఎక్కడైనా ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. మేము ఏ పార్టీతో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నాము. ఒకవేళ బిఆర్ఎస్‌ ఏపీకి వచ్చి వైసీపీతో పొత్తులు పెట్టుకోవాలని కోరితే మా అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలో అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటారు,” అని అన్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల ప్రస్తావన లేకుండా వైసీపీ నేతల సభలు, మీడియా సమావేశాలు పూర్తవవు కనుక వారి గురించి మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సభలు పెడితే జనం వస్తున్నారా?రావడం లేదు కనుకనే ఆయన బాగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ రోడ్ షో అంటూ హడావుడి చేస్తూ వచ్చిపోయే జనాలందరూ తన కోసమే వచ్చారని గొప్పలు చెప్పుకొంటారు. రోడ్ షోలతో ట్రాఫిక్ జామ్‌ చేస్తుంటారు. ప్రజలకి ఇబ్బంది కలుగుతోందని వారించబోతే, “నన్నే అడ్డుకొంటారా?” అంటూ చిందులు వేస్తుంటారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ కారులో కూర్చొని ప్రయాణించకుండా సినిమా స్టైల్లో కారు టాపుమీద కూర్చొని ప్రయాణిస్తూ, ట్రాఫిక్ రూల్స్ నాకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇద్దరూ మేము చట్టాలకి అతీతులమన్నట్లు వ్యవహరిస్తుంటారు. కానీ ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా?” అన్నారు.

హైదరాబాద్‌లో ఉంటున్న సిఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ బిఆర్ఎస్‌ గురించి స్పందిస్తూ, “తెలంగాణలో ఏమీ సాధించలేని కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరుతున్నారు. ముందు తెలంగాణని అభివృద్ధి చేసుకొంటే మంచిది కదా?ఏపీలో నా కొడుకు జగన్మోహన్ రెడ్డిని బిఆర్ఎస్‌ టచ్ చేయలేదు,” అని అన్నారు.

ఏపీ రాజకీయాలలో కులాల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది కనుక సిఎం కేసీఆర్‌ ఆ ప్రకారమే ఏపీలో కొన్ని ప్రధాన కులాల నేతలను గుర్తించి వారితో రాయబరాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా తెలంగాణ సరిహద్దు జిల్లాలపైన ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం.