Saina Nehwal Joins BJPబ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. కాసేపటి క్రితం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్హూ నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ… బీజేపీలో చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. దేశం కోసం పనిచేసే పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు కష్టపడేవారంటే ఎంతో ఇష్టమనీ.. అందుకే దేశం కోసం కష్టపడుతున్న మోదీ నేతృత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరినట్టు స్పష్టంచేశారు.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హర్యానా లో పుట్టిన సైనానెహ్వాల్ బీజేపీలో చేరుతుండటం విశేషం. ఆమె ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ తరపున ప్రచారం కూడా చెయ్యబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలో స్థిరపడిన సైనా ఇక్కడి గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ గేమ్స్ లలో సైనా పతకాలు సాధించారు.

2015వ సంవత్సరంలో ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంకింగ్ మహిళా షట్లరుగా నిలిచారు. ప్రస్థుతం సైనా వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో 9వస్థానంలో ఉన్నారు. సైనా మొత్తం 24 ప్రధాన అంతర్జాతీయ టైటిళ్లు సాధించారు. ప్రభుత్వం ఆమెకు రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను ఇచ్చి గౌరవించింది. 2016లో మోడీ ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది.